నాగ చైతన్య తన తరువాత సినిమాలో ఏకంగా ముగ్గురు భామలతో రోమాన్స్ చేయబోతున్నారు. నాగ చైతన్య చాలా సినిమాలలో చేసినప్పటికీ ఇంకా పూర్తిగా నిలద్రొక్కుకోలేదనే చెప్పాలి. కానీ అప్పుడే ప్రయోగాలు చేయడం ఆరంభించేసాడు. ఆ మధ్యన ‘జోష్’, ‘ఏం మాయ చేసావే’, ‘100% లవ్’ వంటి సినిమాలతో రొమాంటిక్ హీరోగా మంచి పేరు తెచ్చుకొంటున్న సమయంలో ‘దడ’, ‘బెజవాడ’ ‘తడాఖా’ చూపిస్తా అంటూ చెయ్యి కాల్చుకొన్నాడు. అయినా ‘ఆటోనగర్ సూర్య’ ‘దోచేయ్’ వంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ ప్రయోగానికి సిద్దం అవుతున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ప్రేమమ్’ సినిమాను చందు మొండేటి దర్శకత్వంలో నిర్మించబోతున్నారు. క్లుప్తంగా ఈ సినిమా కధ ఏమిటంటే హీరో తన జీవితంలో 15సం.ల వ్యవధిలో ముగ్గురు వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడటం. వారిలో చివరికి ఎవరితో సెటిల్ అయ్యాడు? వారితో ఎందుకు ఎలా విడిపోవలసి వచ్చింది? అనేదే కధ. అంటే నాగ చైతన్య మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే అవకాశం ఉందన్నమాట. ముగ్గురు హీరోయిన్లలో ఒకరు స్కూల్ టీచర్. ఆ పాత్ర కోసం బాలివుడ్ హీరోయిన్ పరినీతి చోప్రాను ఎంపిక చేసుకొన్నారు. మరో హీరోయిన్ పాత్ర కోసం దిషా పటాని (లోఫర్ సినిమా ఫేం) ఖరారు చేసారు. ఇంకా మూడో హీరోయిన్ని ఎంపిక చేయవలసి ఉంది. సమంత లేదా నిత్యా మీనన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు ప్రకటిస్తారు.