బకాయిలు పెరుగుతున్నాయి. చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. సంపన్న రాష్ట్రం తెలంగాణలో ఏం జరుగుతోంది? రాజకీయ పార్టీలకు, జేఏసీకి వచ్చిన ప్రశ్న ఇది. దీనికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం దబాయింపు సెక్షన్ ప్రయోగిస్తోంది.
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రులు ఇటీవల మరోసారి ఆ సేవలను నిలిపివేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా చాలా సార్లు జరిగింది. గతంలో కేసీఆర్ దుమ్మెత్తిపోసిన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఉండేది కాదు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఇంత దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాదు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కొండలా పెరుగుతున్నాయి. కాలేజీల తనిఖీలు సరే. అర్హమైన కాలేజీలకు బకాయిల చెల్లింపు ఎప్పుడు పూర్తి చేస్తారనేది మిస్టరీగా మారింది. గత రెండేళ్ల బకాయిలను ఇప్పటికైనా చెల్లించండి మహాప్రభో అంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కు తెలుగు దేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య విన్నవించారు.
సంపన్న రాష్ట్రం అంటారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. బకాయిలు పెరుగుతున్నాయి. వచ్చే ఆదాయం అంతా ఎటు పోతోందని జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రశ్నించారు. సర్కారుకు వచ్చే సొమ్ములు ఏమవుతున్నాయి? నిజంగా ఇది ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన ప్రశ్నే.
ఓ వైపు రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారంటూ కేసీఆర్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. నిజంగానే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అనవసర ఖర్చులను ప్రభుత్వం తలకెత్తుకుంటోంది. సీఎం క్యాంప్ ఆఫీసు ఉండగా మరోదాని నిర్మాణం చేపట్టారు. దీనికి 35 నుంచి 40 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఎంతో చక్కటి సచివాలయ ప్రాంగణం ఉండగా కొత్త దాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం పంతం పట్టింది. దీనికి 350 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. నిజంగా అది పూర్తయ్యే సరికి ప్రాథమిక అంచనా కంటే ఎంతో భారీగా ఖర్చవుతుందనడంతో సందేహం లేదు.
జిల్లాల పునర్విభజన ఆగమేఘామీద జరిగింది. ఇప్పుడు వాటికి ఆఫీసుభవనాలను సమకూర్చాలి. అదికూడా అదనపు ఖర్చు. ఎడాపెడా జిల్లాలను పెంచడం అశాస్త్రీయం అనే విమర్శలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్ మొదలుకుని అన్ని జిల్లా కార్యాలయాల నిర్మాణానికి భారీగానే ఖర్చవుతుంది. ఓ వైపు మిషన్ భగీరథ వంటి పథకాలకే కేంద్రాన్ని నిధులు కోరుతున్నారు. అలాంటప్పుడు అవసరం లేని ఖర్చులను కోరి తెచ్చుకోవడం ఎందుకు? ఈ ప్రశ్నకు ప్రభుత్వమే జవాబు చెప్పాలి.