చంద్రునిపై ఖనిజాల తవ్వాకాలు. ఆశ్చర్యంగా ఉందా. ఇది నిజం. ఇందుకు పూనుకుంటున్నది కూడా ఓ ప్రవాస భారతీయుడు. పేరు నవీన్ జైన్. వయసు 57. ఐఐటీ రూర్కెలా నుంచి పట్టభద్రుడైన తరవాత 1979లో అమెరికా వెళ్ళిపోయారు. అక్కడే ఐటీ పరిశ్రమలో పరిచేస్తేస్తూ వచ్చారు. 1996 ఇన్ఫో స్పేస్ అనే డాట్‌కామ్ కంపెనీని ప్రారంభించారు. బూమ్ సృష్టించారు. ఏ రంగానికి సంబంధించిన సమాచారానైనా అందించేందుకు వీలుగా ఇంటెలియస్ అనే సంస్థను 2005లో స్థాపించారు. ఈ సంస్థపై అనేకానేక ఫిర్యాదులు రావడంతో పేరును 2012లో ఇనోమ్గా మార్చాడు. 2015లో దానిని విక్రయించేశాడు. ఆదే ఏడాది మూన్ ఎక్స్‌ప్రెస్ అనే అంతరిక్ష సంస్థకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడదే సంస్థ చంద్రుడిపై ఖనిజాల తవ్వకానికి పూనుకుంటోంది. విమానాల మాదిరిగా చంద్రుడిపైకి రాకపోకలను సాగించాలన్న ఇచ్ఛ నవీన్ జైన్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బాబ్ రిచర్డ్స్ ఇందులో సహ భాగస్వామి. జైన్కున్న గందరగోళమైన వృత్తిగత రికార్డు రిచర్స్డ్పై వత్తిడి పెంచుతోంది.
లూనార్ రాకెట్ల వ్యయం తగ్గిపోతుండడం గమనించిన జైన్‌కు చంద్రునిపై ఖనిజాలను కొల్లగొట్టాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా అందుకు శ్రీకారం చుట్టేశాడు. చంద్రునిపై ఒక వ్యక్తి తలపెట్టిన యాత్రకు అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన నెలల్లోనే అదెప్పుడనేది ప్రకటించేశాడు జైన్. 2017 ద్వితీయార్థంలో తన తొలి షటిల్ చంద్రునిపైకి వెడుతుందని వెల్లడించాడు. 1969, జూలై 20న చరిత్రలో మొదటి సారిగా మానవులను చంద్ర గ్రహంపైకి పంపి, క్షేమంగా తిరిగి తీసుకొచ్చిన ఘనత అమెరికాకు చెందుతుంది. ఆ తదుపరి అలాంటి సాహసానికి ఒడిగడుతున్నది నవీన్ జైన్. అతని చంద్ర శోధన కార్యక్రమానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికా అనుమతినిచ్చింది. ఒక ప్రైవేటు కంపెనీకి ఇలాంటి అనుమతి లభించడం ఇదే ప్రథమం. మూన్ ఎక్స్‌ప్రెస్ మిషన్‌కు జైన్ ఛైర్మనే కాక, సహ వ్యవస్థాపకుడు కూడా.
ఇంతకీ జైన్ దీని ద్వారా ఏం సాధించబోతున్నాడు? చంద్రునిపై ఉన్న అపారమైన ఖనిజ సంపదను అతను కొల్లగొట్టబోతున్నాడు. ఒకటి పక్కన 24 సున్నలు పెడితే క్వాడ్రిలియన్ నగదుతో సమానం. ఇలాంటి 16 క్వాడ్రిలియన్ల విలువైన ఖనిజ సంపద చంద్ర గ్రహంలో దాగుందుట. తెలుగులో క్వాడ్రిలియన్ను మహామను క్షోభ సంఖ్య అంటారు. అలా చెప్పుకోవడమే తప్ప.. ఈ మొత్తాన్ని చెప్పడానికి మాటలు లేవు. ఇంత మొత్తంలో ఉన్న ఖనిజాల్ని తవ్వి తీసి, భువికి తెచ్చేందుకు అమెరికా ప్రభుత్వం నవీన్ జైన్‌కు అనుమతినిచ్చిందట. ర్యాకెట్ల ధర తగ్గిపోవడం తన సంకల్పానికి కలిసొస్తోందంటున్నారు జైన్. ఏమిటి నోళ్ళు వెళ్ళబెడుతున్నారా.. ఆగండాగండి.. ఓ దశాబ్దం కిందట ఓ సంస్థ చంద్రుడిపై ప్లాట్లు అమ్ముతున్నామని ప్రకటించింది. వెంటనే ఓ వ్యక్తి తొలి ప్లాట్ కూడా బుక్ చేసేసుకున్నాడు. ఈ కథనాన్ని డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. తదుపరి దాని ఊసే లేదు. ఇప్పుడు నవీన్ జైన్ గారి కార్యక్రమం చంద్రగ్రహాన్ని ఆలంబనగా చేసుకుని మొదలు కాబోతుందంటున్న నవీన్ జైన్ గారి 16 మహామనుక్షోభల యజ్ఞం ఎంతవరకూ నెరవేరుతుందో వేచి చూడాల్సిందే. ఈలోగా మనం ఆయన సంపాదించే మొత్తం ఎంతో లెక్కట్టే పనిలో పడదాం.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి