ఎన్ని దెబ్బలు తిన్నా.. మళ్లీ లేచి నిలబడి, పోరాడడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం నూటికి నూరు పాళ్లూ ఉన్న కథానాయకుడు కల్యాణ్ రామ్. బహుశా కల్యాణ్ రామ్ తిన్నన్ని ఎదురుదెబ్బలు మరో హీరో తిని ఉండడు. అతనొక్కడేకీ పటాస్ కీ మధ్య మరో విజయం అందుకోవడానికి పదేళ్లు పట్టింది. అయినా సరే.. ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ.. ప్రయత్నిస్తూ.. పడుతూ, లేస్తూ.. ప్రయాణం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఇజం అంటూ సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్‌తో సినిమా తీశాడు. ఈ సినిమాకి పూరి దర్శకుడు అవ్వడం, పోస్టర్లు, ట్రైలర్లు ఆసక్తిని రేకెత్తించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈనెల 21న ఇజం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసందర్భంగా కల్యాణ్ రామ్ ఇజం గురించి చెప్పుకొచ్చిన కబుర్లు ఇవీ…
* ఇజం… ఏం చెప్పబోతున్నారు?
– ఇజం అంటే ఫిలాసఫీ, ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ఎక్కడైనా ఉండొచ్చు. ఏ విషయంలోనైనా ఉండొచ్చు. మేం మాత్రం ఓ కొత్త ఇజం చూపించబోతున్నాం. ఆ ఐడియాలజీకి ఏం పేరు పెట్టాలో తెలీక.. జస్ట్ ఇజం అన్నాం. ఇది పూరీ ఇజం కాదు, కల్యాణ్ రామ్ ఇజం అంతకంటే కాదు.
* మీ నిజ జీవితంలో.. మీరు బాగా నమ్మే ఇజం…
– హ్యూమనిజం. దానికంటే గొప్పది ఇంకేం లేదు.
* ఇజంలో పనామా పేపర్స్, బ్లాక్ మనీ.. ఇలాంటి వ్యవహారాలన్నీ ఉంటాయట కదా?
– సోషల్ కాజ్‌తో నడిచే సినిమా ఇది. పనామా పేపర్స్… ఈమధ్య జరిగిన విషయం. మేం ఈకథ ఫైనలైజ్ చేసి చాలా కాలం అయ్యింది. ఈ సొసైటీ పట్ల పూరి గారికి తనదంటూ ఓ ఐడియాలజీ ఉంది. దాన్ని ఓ కొత్త కోణంలో చూపిస్తున్నాం. ఇలా జరిగితే భలే ఉంటుంది కదా? అని ప్రతి ఒక్కరూ అనుకొనేలా ఈ సినిమా ఉంటుంది.
* జర్నలిజంపై సెటైర్లు ఉంటాయని చెప్పుకొంటున్నారు?
– నేను ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపిస్తున్నా. నాపై నేనే ఎందుకు సెటైర్లు వేసుకొంటా? జర్నలిజాన్ని డిఫరెంట్ లెవిల్లో చూపిస్తున్నాం. నాకు స్వతహాగా నెగిటీవ్ కోణంలో ఆలోచించడం నచ్చదు. ప్రతీ రంగంలోనూ బొమ్మా బొరుసూ ఉంటాయి. ఆ రంగం గురించి నాకు అవగాహన లేనప్పుడు, ఆ రంగంలో నేను లేనప్పుడు నాకు నేనే నెగిటీవ్ పాయింట్స్ క్రియేట్ చేసుకొని.. ఓ అభిప్రాయానికి రాలేను.
* పూరి స్టైల్ వేరు.. మీ పద్దతి వేరు. రెండింటికీ ఎలా మ్యాచ్ కుదిరింది?
– ఈ సినిమాలో ఓ కొత్త పూరినీ, కొత్త కల్యాణ్రామ్నీ చూస్తారు.. మేమిద్దరం చాలా మారాం . డైలాగులు చెప్పడంలో, నిలబడడంలో, నడకలో నాలో చాలా మార్పులు కనిపిస్తాయి. పూరి ఇప్పటి వరకూ తీసిన సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు. అంత మార్పు కనిపిస్తుంది. పూరి కెరీర్లో, నా కెరీర్లో ఇదే బెస్ట్ మూవీ అని చెప్పగలను.
* అంత నమ్మకం దేనిపైన?
– ఈ సినిమా నేను చూస్తున్నప్పుడు గూజ్ బమ్స్ వచ్చాయండీ. నా డైలాగులు, ఆ సన్నివేశాలు అన్నీ నాకు తెలుసు. కానీ తెరపై నా సినిమాని నేను చూసుకొంటున్నప్పుడు ఇదేంటి? ఇలా ఉంది? అనిపించింది. మా నమ్మకం వృథా కాదు. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇజం నమ్మదగిన సినిమా. అయితే ఎంత మంచి సినిమా అవుతుందో ఇప్పుడు చెప్పలేను.
* సిక్స్ ప్యాక్ చేయాలన్న ఆలోచన ఎవరిది? ఎందుకు చేయాల్సివచ్చింది?
– ఇజం కథతో పూరి గారు నన్ను కలసినప్పుడు నా బాడీ చూసి ‘ఇలా ఉంటే కుదరదు’ అన్నారు. ‘ఏం చేయాలి సార్’ అని అడిగా. సన్నబడాల్సిందే అని తెగేసి చెప్పారు. దాని కోసం జిక్స్ ప్యాక్ చేయాల్సివచ్చింది. మూడు నెలల్లో పది కేజీలు తగ్గా. అయితే సిక్స్ ప్యాక్ అన్నది చాలా ఓల్డ్ ఫ్యాషన్. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది.. (నవ్వుతూ)
* అలాంటప్పుడు అంత కష్టపడి సిక్స్ ప్యాక్ చేయడం ఎందుకు?
– స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న హీరో క్యారెక్టర్ ఇది. ఐడియాలజీనే కాదు.. బాడీ కూడా ఫిట్‌గా ఉండాలి. అందుకే సిక్స్ ప్యాక్ చేశా.
* కోర్టు సీన్లు చేస్తే నందమూరి హీరోలే చేయాలి అని పూరి చెబుతున్నారు.. మీ మాటేంటి?
– నిజంగా అది గొప్ప కాంప్లిమెంట్. అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఈసినిమాలోనూ ఓ కోర్టు సీను ఉంది. అది తప్పకుండా అందరికీ నచ్చుతుంది.
* ఎన్టీఆర్ ఈ సినిమా చూశారా?
– ఇంకా చూళ్లేదు. కాకపోతే ఈ సినిమా గురించి అంతా తనకు తెలుసు. మేం మా సినిమాల గురించి తరచూ మాట్లాడుకొంటూనే ఉంటాం. ఈ సినిమా టీజర్‌ని నాకంటే ముందు తారక్‌కే చూశాడు.
* సినిమా సినిమాకీ మీలో మార్పు కనిపిస్తోందా?
– చాలా. నా ఏ రెండు సినిమాలూ ఒకేలా ఉండవు. యాక్టింగ్ లోనూ చాలా మార్పు ఉంటుంది. నటుడిగా నేను నేర్చుకొంటూ ఎదుగుతున్నా అనేది అర్థం అవుతోంది.
* వక్కంతం వంశీ సినిమా ఏమైంది?
– ప్రస్తుతానికి పక్కనెట్టాం.
* కారణాలేమైనా ఉన్నాయా?
– నిజం చెప్పాలంటే కథ నచ్చలేదు. నేనూ, తనూ సంతృప్తి పొందలేకపోయాం. బెటర్ కథ కోసం తను కృషి చేస్తున్నాడు.
* కథ నచ్చలేదు అని నేరుగా చెప్పేస్తే… ఎవరైనా ఫీల్ అవుతారు కదా?
– చెప్పకపోతే నేను ఫీల్ అవ్వాలి. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు కదా? ఒకవేళ నచ్చని కథతో సినిమా తీస్తే.. ఆ సినిమా ఫ్లాప్ అయితే.. ఆ తరవాత మేమిద్దరం కూర్చుని ఒకరిని మరొకరు నిందించుకోవాలి. అదేదో ముందే ‘నో’ చెప్పేస్తే సమస్యే ఉండదు కదా? పైగా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది వరకు `నో` చెప్పడానికి మొహమాట పడి చాలా పోగొట్టుకొన్నా.
* తదుపరి సినిమా ఏమిటి?
– ఇంకా అనుకోలేదు. కొన్ని కథలు వింటున్నా. త్వరలోనే.. కొత్త సినిమా ఏమిటో చెబుతా..
* ఓకే.. ఆల్ ద బెస్ట్…
– థ్యాంక్యూ…