నందమూరి హీరో, మెగా హీరో కలిస్తే ఎలా ఉంటుంది? ఈ రెండు కుటుంబాల నుంచి ఓ మల్టీస్టారర్ వస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ. ఈ ఆలోచనే ఏఎస్ రవికుమార్ చౌదరికి వచ్చింది. ఓ కథని సిద్దం చేసుకొని కల్యాణ్‌రామ్, సాయిధరమ్ తేజ్‌లకు వినిపించారు. వాళ్లిద్దరూ ఓకే అన్నారని, ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడం ఖాయం అన్నారంతా. ఈ సినిమాకి ‘రామకృష్ణ’ అనే టైటిల్ కూడా ఖారారైందని చెప్పుకొన్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు డైలామాలో పడినట్టు టాక్. ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లడం కష్టమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ సినిమాపై అటు మెగా హీరో, ఇటు నందమూరి హీరో స్పష్టంగా ఏమీ చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మల్టీస్టారర్లకు తాను సిద్దమే అని, అయితే ఇంకా కథ వినలేదని, కథ నచ్చితే ఎవరితో అయినా సినిమా చేస్తానని చెబుతున్నాడు కల్యాణ్ రామ్. ఈ కథని ఇది వరకే కల్యాణ్‌రామ్ కి వినిపించాడు ఏఎస్ రవికుమార్ చౌదరి. అప్పుడు ‘ఓకే’ అనేసిన కల్యాణ్ రామ్.. ఇప్పుడు ‘కథ వినలేదు’ అంటూ మాట మార్చడం వెనుక చాలా కారణాలు ఉండి ఉండొచ్చన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల మాట.
రవికుమార్ చౌదరి చెప్పిన కథ బాగానే ఉన్నా, తనని నమ్మి సినిమా అప్పగించడానికి కల్యాణ్ రామ్ ఆలోచిస్తున్నాడని టాక్. రవికుమార్ చౌదరి సౌఖ్యం డిజాస్టర్ అయ్యింది. పైగా కల్యాణ్‌రామ్ ఇప్పుడు ప్రయోగాలు చేసే స్థితిలో లేడు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేద్దాం అనుకొంటున్నాడట. మరోవైపు సాయిధరమ్ తేజ్ పరిస్థితీ అంతే. పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ సినిమా చేద్దామనుకొన్నాడు సాయిధరమ్. అయితే ప్రస్తుతం సాయి కెరీర్ బిజీ బిజీగా సాగుతోంది. కొన్ని డేట్లు తీసి రవికుమార్ చౌదరికి ఇచ్చేంత టైమ్ లేదు. పైగా… సౌఖ్యం రిజల్ట్ సాయి మనసునీ మార్చి ఉంటుందని చెబుతున్నారు. లైన్ చెప్పి ఊరుకొన్న రవికుమార్ చౌదరి స్క్రిప్టుని పూర్తి చేయడంలో టైమ్ తీసుకొంటున్నాడని అందుకే ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని చెబుతున్నారు.