కార్పొరేట్ కాలేజీలు విద్యను వ్యాపారమయం చేశాయని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అందువలననే పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తా పత్రిక ప్రకటనల్లాగా ఈ మాటలు బాగానే ఉన్నాయి కానీ పాపాన్ని కాలేజీ యాజమాన్యాల పైకి నెట్టేయడం మాత్రం కరెక్ట్ కాదేమో. అసలు పాపం పాలకులదే. లేకపోతే కార్పొరేట్ కాలేజీ యజమానులు కూడా అయిన పాలకులదే. నారాయణ కాలేజీల అధినేత నారాయణగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి. అది కూడా దేశంలోనే అత్యంత ధనికుడైన మంత్రి. ఇక ఆయనకు బాగా దగ్గర బంధువు అయిన గంటా శ్రీనివాసరావు విద్యా వ్యవహారాలు చూసుకునే మంత్రి. ఇక ఈ ఇద్దరు మంత్రి వర్యులు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకుని వస్తారు?
బిసిసిఐ అనే ఓ క్రీడా సంస్థలో పరస్పరం లాభపడే విధంగా ఒకే వ్యక్తి రెండు పదవులను చేపట్టడం తప్పు అని తీర్పులు ఇచ్చారు. ఆ ఒక్కటే కాదు ఎక్కడా కూడా క్విడ్ ప్రో ఖోకు అవకాశం లేకుండా అనేక నిబంధనలను బిసిసిఐకి వర్తింప చేయాలని చూస్తున్నారు. చాలా మంచి నిర్ణయాలే. మరి అవే నిబంధనలు ప్రభుత్వాలకు వర్తించవా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారాయణ… కార్పొరేట్ కళాశాలలకు నష్టం జరిగేలా, పేద విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఏదైనా పాలసీ తీసుకొస్తానంటే ఆ పాలసీకి అడ్డుపడకుండా ఉంటాడా? నారాయణ కాలేజీల ద్వారా వచ్చే లాభాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడా? తెలంగాణాలో టిడిపి నుంచి ఎంపిగా గెలిచిన మల్లారెడ్డి… అనతి కాలంలోనే టిఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు జంప్ చేశాడు? తన కార్పొరేట్ విద్యా వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న లొసుగులను బయట పెట్టే ప్రయత్నం కెసీఆర్ చేయబట్టి కాదా? ఈ నాయకులే అని ఏముంది? ప్రజలకు నిత్యావసరాలైన విద్య, వైద్యంతో పాటు ఇంకా అనేక విషయాలను వ్యాపారమయం చేసిన ఘనత మన పాలకులదే. విద్యా వ్యాపారంతో కోటాను కోట్లు సంపాదించుకున్న బడా బడా వ్యాపారస్తుల నుంచి లంచాలు తీసుకోని నాయకులు ఉన్నారా? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏముంది? అందరూ ఆ తానుముక్కలే. ప్రజా సంక్షేమమే మా ఊపిరి అని ఊదరగొడుతూ ఉంటారు. కాసులకు కక్కుర్తిపడి ప్రజలకు నిత్యావసరాలైన విద్య, వైద్యరంగాలను వ్యాపారమయం చేస్తూ ఉంటారు. కొన్ని దశాబ్ధాలుగా నడుస్తున్న చరిత్ర ఇదే.