చంద్రబాబునాయుడిదంతా కార్పొరేట్ స్టైల్. అంటే ఎల్లవేళలా అలానే అని కాదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు ఆలోచనలు అన్నీ కార్పొరేట్ స్టైల్లోనే ఉంటాయి. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పేదలు, రైతులు, ధర్నాలు, రోడ్డు షోలు, పాదయాత్రలు, నిరాహారదీక్షలు …అంటూ అధికారంలో లేని నాయకులు వేసే వేషాలన్నీ వేస్తూ ఉంటారు. ఒకసారి అధికారం వచ్చిందంటే మాత్రం.. కనీసం విమర్శలను కూడా భరించలేడు. అందేంటంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని నిందలేస్తూ ఉంటారు. అసలే ఎక్కువ భాగం తెలుగు మీడియా సంస్థలు చంద్రబాబుకు కొమ్ము కాస్తూ ఉన్న పరిస్థితి. ఆయన పాలన అద్భుతః అని తమ రచనా నైపుణ్యాలను, ఊహాశక్తిని విచ్చలవిడిగా వాడేస్తూ ఊదరగొట్టేస్తూ ఉంటారు. ప్రత్యేక హోదా కావాలి అన్న గొంతులన్నీ ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి కానీ ప్యాకేజ్ గొప్పది అని మాత్రం చంద్రబాబు, వెంకయ్యనాయుడులు చెప్తూనే ఉన్నారు. మీడియాలో కూడా ఆ వార్తలే కనిపిస్తూ ఉన్నాయి.
పశ్ఛిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఆ నిర్మాణాన్ని చాలా మందో…లేక కొంత మందో వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ఆ ప్రజల తరపున మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఓ ముఖ్యమైన విషయంపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 30 రోజులుగా ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ ఎందుకు పెట్టారో తనకు అర్థం కాలేదని చెప్పాడు పవన్. అక్కడి ప్రజలు ఏమైనా ఆయుధాలు పట్టుకున్నారా? అని కూడా ప్రభుత్వాన్ని నిలదీశాడు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే 144 సెక్షన్ విధించి ఉన్నప్పుడే ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. మామూలుగా పోలీసులు గ్రామంలోకి అడుగుపెడితేనే చాలా మంది ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రావడానికే ఇష్టపడరు. ఇక 144 సెక్షన్ అని ఓ వైపు పోలీసులు హడావిడి చేస్తూ ఉంటే అసలు ప్రజలు బయటకు వస్తారా? ఒకవేళ వచ్చినా స్వచ్ఛంధంగా, ధైర్యంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పగలరా? అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలరా? రాజధాని కోసం భూములు తీసుకున్నప్పుడు కూడా ఇదే 144 సెక్షన్‌ని ఆయుధంగా వాడేశాడు చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అందరూ వ్యతిరేకిస్తున్నారని కాదు కానీ, వ్యతిరేకిస్తున్న వారి అభిప్రాయాలు బయటకు రాకుండా తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు? అన్నదే ప్రశ్న. ప్రజాస్వామ్యం గురించి, ప్రజా అభిప్రాయాలు, ఆలోచనలకు ఉన్న విలువ గురించి ఇదే చంద్రబాబు ఎన్నో సార్లు అద్భుతంగా, చాలా గొప్పగా మాట్లాడేసి ఉన్నారు. ఇక మీదట కూడా సందర్భం వచ్చినప్పుడల్లా అంతకంటే గొప్పగా మాట్లాడతారనడంలో కూడా సందేహం లేదు. 144 సెక్షన్ విధించి మరీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడమేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అంటే?