గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం! ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి, ఏం జరుగుతోందో కూడా ప్రజలకు తెలియనివ్వకుండా, వదంతుల వ్యాప్తికి అనువైన వాతావరణాన్ని సృష్టించింది వారే! ఇప్పుడు, ఆ వదంతులపై కొరడా ఝుళిపిస్తున్నదీ వారే. జయలలిత ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచీ సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొందరేమో ఆమె మరణించిందనీ, ఆ విషయాన్ని దాచి పెడుతున్నారని వందతులు రేపితే… మరికొందరు కోలుకుంటున్నారూ, పత్రికలు చదువుతున్నారూ, నర్సులతో మాట్లాడుతున్నారూ… ఇలాంటి సమాచారాలు ప్రచారంలోకి తెస్తున్నాయి. అయితే, అమ్మ పేరుతో ఇలా ఇంటర్నెట్లో వెల్లువెత్తుతున్న వదంతులకు చెక్ పెట్టేందుకు ఒక ఐటీ డెస్క్‌ను తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసింది.
ఈ డెస్క్ 24/7 పనిచేస్తోంది. రోజూ మూడు షిఫ్టులలో ఐటీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి పనేంటంటే… అమ్మ పేరుతో సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ దుష్ప్రచారం జరుగుతోందో గుర్తించడం! ఆ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వానికి ఇవ్వడం. దాని ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఓ 50 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అమ్మ ఆరోగ్యంపై పుకార్లు పుట్టిస్తున్నవారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికార పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. విదేశాల్లో ఉంటున్న తమిళ ప్రజలు కూడా సోషల్ మీడియాలో లేనిపోని అభిప్రాయాలను ప్రచారంలోకి తెస్తున్నారనీ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా అమ్మ ఆరోగ్య పరిస్థితిపై కట్టుకథలు పెడితే అది శిక్షార్హం అవుతుందని అంటున్నారు. అమ్మకు చికిత్స జరుగుతోందనీ, ఆమె మెల్లగా కోలుకుంటున్నారనీ, మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఇంత చర్చకు దారి తీసే పరిస్థితులు ఎందుకొచ్చాయి..? అమ్మ ఆరోగ్యం గురించి నిజాలు బయటకు రాకపోవడం వల్లనే వదంతులకు ఆస్కారం పెరిగింది. పుకార్లు పురుడు పోసుకుంటున్నాయి. అభిమానులూ అధికార పార్టీ అనుచరుల్లో అమ్మ ఆరోగ్యంపై చాలా ఆవేదన వ్యక్తం అవుతోంది. మొన్నటికి మొన్న ఇదే విషయమై ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంకోపక్క హోమాలూ పూజలూ చేస్తున్నారు. చిన్న పిల్లలకు శూలాలు వేస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యం విషయంలో మొదట్నుంచీ ఎలాంటి రహస్యాలకూ తావు లేకుండా ఉంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. ఐటీ డెస్కులు పెట్టాల్సిన అవసరమూ ఉండేది కాదు.