అభ్యుదయ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటుడు… ఆర్.నారాయణమూర్తి. ఈ రెడ్ స్టార్ సినిమా అంటే ఆయనే నటన, ఆయనే సంగీతం, దర్శకత్వం అన్నీ. అయితే… చాలా కాలం తరవాత మరొకరి దర్శకత్వంలో నటించడానికి ముందుకొచ్చాడు. ఆర్.నారాయణమూర్తి కథానాయకుడిగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టబోతోంది. చదలవవాడ శ్రీనివాసరావు నిర్మాత. ఈ చిత్రానికి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే పేరు పెట్టారు. నారాయణమూర్తికి జోడీగా సహజ నటి జయసుధ నటిస్తున్నారు. వీరిద్దరూ కలసి నటించడం ఇదే తొలి సారి. ఈనెల 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 60 రోజుల పాటు రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది. నీతి, నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి నిజ జీవితంలో, వృత్తిపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటిని అదిగమించి విజయమెలా సాధించాడనేదే కథాంశం. ఒరేయ్ రిక్షా తరవాత… నారాయణమూర్తి బయటి సంస్థలో సినిమా చేయడం ఇదే తొలిసారి. టెంపర్ సినిమాలో నారాయణమూర్తి తో హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయిద్దామని పూరి జగన్నాథ్ చాలా ప్రయత్నించాడు. కోటి రూపాయలు పారితోషికం ఇస్తానని ఊరించాడు కూడా. అయితే… నారాయణమూర్తి సున్నితంగా తిరస్కరించడంతో ఆ పాత్ర పోసాని కృష్ణమురళి చేతికి చేరింది. ఇప్పుడు బయటి సినిమాలో నారాయణమూర్తి చేస్తున్న పాత్ర కూడా హెడ్ కానిస్టేబుల్‌గానే కావడం విశేషం.