టెస్టుల్లో భారత ఆటగాళ్లు వీరవిహారం చేసి కివీస్‌కి చుక్కలు చూపించారు. 3 – 0 తో టెస్టు సిరీస్ కైవసం చేసుకొన్న టీమ్ ఇండియా.. ఇప్పుడు వన్డేల్లోనూ న్యూజీలాండ్ కొమ్ములు విరిచింది. తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్‌ని ఘనంగా ప్రారంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజీలాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల కు ఎదురు నిలవలేకపోయింది. భారత పేసర్లు ఉమేష్ యాదవ్, పాండ్య చెరో మూడు వికెట్లతో చెలరేగిపోవడంతో 190 పరుగులకు చాప చుట్టేసింది కివీస్. ఒక దశలో న్యూజీలాండ్ వంద పరుగులూ దాటడం కష్టమనిపించింది. అయితే.. లేథమ్ (79 నాటౌట్) సౌథీ (55) ఆదుకోవడంతో ఈమాత్రం పరుగులైనా చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్.. సునాయాసంగా విజయ లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదన అనగానే రెచ్చిపోయి ఆడే.. కొహ్లి (85 నాటౌట్) మరోసారి రెచ్చిపోయాడు. అతని బ్యాటింగ్‌కి ఈరోజు అడ్డే లేకుండా పోయింది. రెహానే (33), ధోనీ (21) రాణించడంతో మరో 16 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకొంది. హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో వన్డే ఈనెల 20న దిల్లీలో జరగనుంది.