బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ సినిమా ఎప్పుడో జమానా క్రితం మొదలై… మధ్యలో ఆగిపోయింది. నయనతార కథానాయిక కావడం, వక్కంతం వంశీ కథ అందివ్వడం, మణిశర్మ పాటలు.. ఇలా ఈ సినిమాకి ఆకర్షణాంశాలు చాలా ఉన్నాయి. అయితే… చివర్లో నిర్మాతలు చేతులెత్తేయడం వల్ల ‘క్లైమాక్స్’ కి ముందు ఆగిపోయింది. సినిమా ఆపేసి రెండేళ్లు గడిచాయి. ఈలోగా గోపీచంద్ సినిమాలు మూడొచ్చాయి. ఈలోగా నిర్మాతలు ఆర్థికంగా బలాన్ని కూడగట్టుకొని.. క్లైమాక్స్ తంతు పూర్తి చేయడానికి ముందుకు కదిలారు. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దీపావళికి విడుదల చేస్తారట. టైటిల్ కూడా అప్పుడే చెబుతారట. బి.గోపాల్ స్టైల్ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయింది. దానికి తగ్గట్టు ఈ సినిమా గురించి కూడా జనం మర్చిపోయారు. ఆగి.. ఆగి పూర్తయిన ఏ సినిమా బాక్సాఫీసు దగ్గర విజయాన్ని అందుకొన్న దాఖలాలు కనిపించడం లేదు. దాంతో… గోపీచంద్ సినిమాపై బయ్యర్లు కూడా దృష్టి పెట్టడం లేదు.
అదేంటో ఈ సినిమా మొదలయ్యేటప్పుడే… ‘గోపీచంద్ – బి.గోపాలా? వర్కవుట్ అవుతుందా?’ అన్నట్టు జనం మాట్లాడుకొన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని దురదృష్టం వెంటాడింది. నిజానికి ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకుడు కాదు. ఈ కాంబో సెట్టయ్యిందే ఓ తమిళ దర్శకుడి వల్ల. ఆయన మధ్యలోంచి అర్థాంతరంగా వెళ్లిపోతే.. అప్పుడు బి.గోపాల్ వచ్చి కలిశారు. ఈ సినిమా ఆగిపోవడంతో గోపీచంద్ కూడా.. వదిలేశాడు. ఈ సినిమా గురించి ఎప్పుడు అడిగినా గోపీచంద్ సమాధానం చెప్పడానికి కూడా బద్దకించేవాడు. ‘ఇప్పుడెందుకు లెండి.. ఆ సినిమా గురించి’ అంటూ దాటేసేవాడు. ఇప్పుడు కూడా ముక్తసరిగానే క్లైమాక్స్ పూర్తి చేసి చేతులు దులుపుకోవడానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయి.. బయటకు వచ్చినా క్రేజ్ వస్తుందన్న నమ్మకం లేదు. ఒకవేళ ఆక్సిజన్ విడుదలై.. హిట్టయితే.. అప్పుడు ఈ సినిమాని దించి నాలుగు సొమ్ములు చేసుకోవాలన్నది చిత్రబృందం ఆలోచన. అంటే… ఈ సినిమాకి ఆక్సిజన్ అందివాల్సిన సినిమా ఆక్సిజనే అన్నమాట. ఆ సినిమా కూడా అటూ ఇటూ అయితే.. ఇక అంతే సంగతులు.