ఏపీలో కొన్ని చోట్ల రైతులకు అష్టకష్టాలు షరమామూలుగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టు వల్ల వచ్చేకాలుష్యంపై రైతులు ఎంత ఆందోళన చెందినా, ముందుకు పోవడానికే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి రైతుల అనుమానాలను నివృత్తి చేస్తారట. అంతేగానీ రైతుల ఆక్రోశాన్ని, అందులోని వాస్తవాన్ని పట్టించుకునే ఓపికా తీరికా ప్రభుత్వానికి లేనట్టుంది.
ఇంకా అనేకచోట్ల భూసేకరణ వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాల సోలార్ పవర్ ప్లాంటుకు భూములిచ్చిన రైతుల పరిస్థితి దయనీయగా ఉంది. నష్టపరిహారం కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ధర్నాలు, నిరాహార దీక్షలతో ప్రభుత్వంలో కదలిక రాలేదు. బాధిత రైతులకు బాసటగా వామపక్షాలు కూడా ఆందోళన బాట పట్టాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు.
సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం ప్రభుత్వం 1500 ఎకరాలను కేటాయించింది. దానికి పరిహారం లేదు. భూమి ఇచ్చిన రైతులు ఎలా బతకాలనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి జవాబు లేదు. అలాగే, ఆనాడు హామీ ఇచ్చిన ప్రకారం రైతు కుటుంబాల వారికి ఉద్యోగాలు కూడా రాలేదు. అప్పట్లో ఏ పార్టీ ప్రభుత్వం ఉందనేది వేరే విషయం. ఇప్పుడున్న ప్రభుత్వం రైతులు నష్టపోకుండా చూడాలి. అది దాని బాధ్యత. ప్రజల కోసం రైతుల కోసం పనిచేస్తున్నామని చెప్పే చంద్రబాబు తమను ఎందుకు పట్టించుకోవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశాన్ని సీపీఎం సీరియస్ గా తీసుకుంది. ఈసారి ఆందోళన ఉధృతం చేస్తామని, రైతులకు పరిహారం అందే వరకూ ఊరుకునేది లేదని నాయకులు చెప్తున్నారు. కడుపు మండిన కర్షకుడు కదం తొక్కితే ఎంతటి ప్రభుత్వమైనా కదిలి రావాల్సిందే. మరి ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం గుర్తిస్తుందో, మాకేంటని మొండికేస్తుందో చూద్దాం.