హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధా ఏపీకి చెందిన ఇరిగేషన్ శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, వైద్య, ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. విషజ్వర బాధితులకు న్యాయం చేయాలంటూ మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ దీక్ష చేస్తున్న శిబిరంవద్ద రాధా మాట్లాడారు. రాష్ట్రంలో విషజ్వరాలతో 18మంది చనిపోతే విషజ్వరాలు లేవని మంత్రి కామినేని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. విషజ్వరాలు ఉన్నాయని, వాటిబారినపడి ప్రజలు మృతిచెందుతున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తే మంత్రిపదవికి కామినేని రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ముడుపులు ముట్టాయనికూడా రాధా ఆరోపించారు. తమపార్టీ అధినేతపై అనవసర విమర్శలు చేస్తే వైఎస్ఆర్, వంగవీటి అభిమానులు ఊరుకోరని రాధా హెచ్చరించారు.