బడా స్టార్ల సినిమాలకు బెనిఫిట్ షోలతో హడావుడి చేయడం మామూలే. మహేష్, ఎన్టీఆర్, పవన్ లాంటి స్టార్ల సినిమాలొస్తున్నాయంటే బెనిఫిట్ షోల నుంచే హడావుడి మొదలైపోతుంది. టికెట్ రూ.1000, 2000 పలికేస్తాయి.నిక్ ఆఫ్ ది మూమెంట్లో రూ.3000 పలికిన సందర్భాలూ ఉన్నాయి. స్టార్ హీరో సినిమా అంటే ఒక్క హైదరాబాద్‌లోనే కనీసం ఏడెనిమిది థియేటర్లలో బెనిఫిట్ షోలు పడతాయి. ఇజం సినిమాకీ అలాంటి హంగామానే కనిపించింది. పూరి జగన్నాథ్ – కల్యాణ్ రామ్‌ల కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న ఇజం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎప్పుడూ లేని విధంగా కల్యాణ్ రామ్ సినిమాకీ బెనిఫిట్ షో వేశారు. కూకట్‌పల్లిలోని బ్రమరాంబ థియేటర్లో ఉదయం ఆరుగంటలకు బెనిఫిట్ షో పడింది. అయితే సగం థియేటర్ కూడా నిండకపోవడం ఆశ్చపరిచింది. తొలుత రూ.500 అమ్మిన టికెట్… ఆ తరవాత రూ.300లకు పడిపోయింది. సినిమా కాసేపట్లో మొదలవుతుందనగా రూ.100కి కూడా అమ్మడం విశేషం. థియేటర్లో సగం కూడా నిండకుండా బెనిఫిట్ షో పడడం ఇదే తొలిసారేమో? థియేటర్‌కి సెలబ్రెటీలు వచ్చినా… ఒకే ఒక్క థియేటర్‌కి బెనిఫిట్ షో పరిమితమైనా.. జనం లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. ఆఖరి నిమిషాల్లో బెనిఫిట్ షో పర్మిషన్ రావడం, టికెట్లు సరిగా బట్వాడా చేయకపోవడంతో బెనిఫిట్ షో కాస్త నీరసంగా సాగింది.