హైదరాబాదీ సంచలనం పీవీ సింధు కొందరు అభిమానుల అనుమానాలనే నిజం చేసింది. రియో ఒలింపిక్స్ లో ఒక్క రజత పతకంతో దేశంలో ఓ స్టార్ గా మారింది. పతకాలకోసం ముఖం వాచిన దేశంలో ఆమె గెలిచిన వెండి పతకం బంగారం కంటే విలువైందిగా కనిపించింది. అంతే, ప్రశంసలు, నజరానాలు, ఖరీదైన కార్లు, కోట్ల రూపాయల డీల్స్, షోరూముల ఓపెనింగ్ ఒప్పందాలు… వావ్. ఆమె ఒక క్రీడాకారిణిలా కాకుండా గ్లామర్ ప్రపంచపు సెలెబ్రిటీలా గడిపింది.
రియో ఒలింపిక్స్ తర్వాత గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత ఆడిన తొలి టోర్నీ రెండో మ్యాచ్ లో పోరాడకుండానే ఓడిపోయింది. ఆటలో గెలుపు ఓటమి సహజం. ఎలా ఓడారనేదే ముఖ్యం. పోరాడి గెలిచిన వ్యక్తికి విజేతతో సమానంగా గౌరవం లభిస్తుంది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మ్యాచ్ లో సింధులో లోపించింది అదే. పోరాట స్ఫూర్తి.
గత ఏడాది ఇదే టోర్నీలో సింధు ఫైనల్ వరకూ దూసుకు పోయింది. రన్నరప్ గా నిలిచింది. ఈసారి రెండో రౌండ్ లోనే ఇంటిముఖం పట్టింది. రియోలో పతకం గెలిచిన ఉత్సాహంతో ఆమె ప్రత్యర్థిని చిత్తు చేస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. జపాన్ క్రీడాకారిణి సయాక శాటో కూడా తాను ఇంత సులభంగా సింధుపై గెలుస్తానని ఊహించి ఉండదు. ఆరో సీడ్ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడలిస్ట్ పై సునాయాస విజయంతో శాటో పండగ చేసుకుని ఉంటుంది. రెండో గేములో మాత్రం సింధు తన స్థాయికి తగ్గట్టు ఆడింది. ఆ గేమును గెలిచిన జోష్ ను మూడో గేములో కొనసాగించి ఉంటే మ్యాచ్ గెలిచేది. కానీ అలా జరగలేదు.
ఈ మ్యాచ్ లో సింధు ఆడిన తీరును గమనిస్తే అనవసర తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే కసి అంతగా కనిపించలేదు. రియో ఒలింపిక్స్ లో ఆడిన సింధు, ఈ సింధు ఒక్కరేనా అన్న అనుమానం వచ్చింది. కోట్లాది రూపాయల సర్కారీ నజరానాలు, బీఎం డబ్ల్యు కారు బహుమతి, 50 కోట్ల అడ్వర్టయిజ్ మెంట్ డీల్, షోరూములు, మాల్స్ ఓపెనింగ్ ఒప్పందాలతో సింధులోని క్రీడాకారిణిని చంపేస్తున్నారని ఈమధ్య కొందరు బాధపడ్డారు. అయితే అది అర్థం లేదని వాదన అన్న వారూ ఉన్నారు.
సెలబ్రిటీ స్టేటస్ మరీ ఎక్కువగా తలకెక్కితే ఆట అంతే సంగతులు కావచ్చు. క్రికెట్ దేవుడంటూ జనం ఎంత ఆకాశానికి ఎత్తినా నేలను విడవకుండా ఆటకే ప్రాధాన్యం ఇచ్చిన సచిన్ వంటి వారు స్ఫూర్తి ప్రదాతలు. సింధు ఆ బాటలో వెళ్తేనే క్రీడాకారిణిగా మరింతగా రాణించగలదు. లేకపోతే అభిమానులు మరింత నిరాశ పడక తప్పదు.