సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి
మీరు బ్యాంకు లావాదేవీలన్నీ ఆన్లైన్లో చేస్తుంటారా. హోటల్‌కు వెళ్లినా.. షాపింగ్ మాల్‌కు వెళ్లినా.. దినసరి కొనుగోళ్ళకూ డెబిట్ కార్డును వినియోగిస్తున్నారా. డెబిట్ కార్డుల సమాచారం చైనా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నతాజా సమాచారం ఇలాంటివారినందరినీ కలవరపరుస్తోంది. తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మాయమైందని ఇప్పటికే కొందరు ఫిర్యాదులు కూడా చేశారు. బ్యాంకుల్నీ, అవిచ్చిన క్రెడిట్, డెబిట్ కార్డుల్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రోజుల్లో ఇలాంటి వార్తలు సామాన్య, మధ్య తరగతి ప్రజలనే కాదు అన్ని వర్గాలనీ ఉలికిపాటుకు గురిచేసింది. భారత్‌పై చైనా సైబర్ దాడికి పూనుకుందనీ, డెబిట్ కార్డుల సమాచారాన్ని చోరీ చేసి, తమ గుప్పెట్లో పెట్టుకుందన్న వార్తలు నిజమా కాదా అనేది ఎవరికీ తెలీదు. దీని గురించి ఎవరూ ఆందోళన చెందవద్దనీ, సమాచారం ఎక్కడికీ పోలేదనీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్వయంగా ప్రకటన జారీ చేశారు. అంటే ఏదో జరిగింది. కొన్ని బ్యాంకుల నుంచి డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందనీ, కొత్త పిన్ పంపిస్తామనీ ఫోన్లు రావడం దీన్ని రూఢీ చేస్తోంది. బ్యాంకులే ఈ ఫోన్లు చేస్తున్నాయా.. ఇది సైబర్ నేరగాళ్ళ పనా అనేది తేల్చాల్సింది సంబంధిత విభాగం పని. ఈలోగా కొన్ని పద్ధతులు పాటించి, ఆన్లైన్లో సురక్షితంగా లావాదేవీలు చేసుకునే ప్రయత్నం చేయాలి.
పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చుకోవాలి. అందులో అక్షరాలతో పాటు సంఖ్యలు, @, $, # వంటి సింబల్స్ ఉండేలా చూసుకోవాలి. మీ భార్య పేరో, పిల్లల పేర్లో, పుట్టిన తేదీ వంటివి పాస్‌వర్డ్‌గా సెట్చేసుకోకండి.
మీరు ఉపయోగించే అన్ని వెబ్సైట్లకీ ఒకే పాస్వర్డ్ పెట్టుకోకూడదు. ప్రతీ సైట్‌కీ దాన్ని మార్చుకోవాలి. కనీసం నెలకోసారైనా పాస్‌వర్డ్‌ని మార్చేయాలి.
మీ పాస్వర్డ్స్ ఆన్లైన్లో సేవ్ చేయకూడదు. ఎక్కడైనా రాసుకుని భద్రపరచుకోవాలి.
http:// కాకుండా https:// పేరుతో ఉన్న వైబ్సైట్లను వాడితే మేలు. ఇందులో ‘s’ అంటే సెక్యూర్ అని అర్ధం.
ఇంటర్నెట్ కేఫ్‌ల నుంచి ఆన్లైన్లో నగదు బదిలీలూ వద్దు. ఇల్లు లేదా కార్యాలయాల్లో వ్యక్తిగత కంప్యూటర్లను వాడండి. ఉచితంగా అందుబాటులో ఉండే వైఫై వాడకాన్ని నివారించండి. ఈ వైఫైలను చాలా తేలిగ్గా హ్యాక్ చెయ్యచ్చు. అంటే మీ లావాదేవీల వివరాలను ఆ వైఫై నిర్వాహకులు ఎంతో సులభంగా తెలుసుకునే అవకాశముంది.
లావాదేవీ అనంతరం వెబ్సైట్ విజయవంతంగా నిర్థారించుకున్న తరవాతే బ్రౌజర్‌ను ముయ్యాలి. అలా కాకుంటే పాస్వర్డ్, తదితర వివరాలు అందులో ఉండిపోతాయి.
వన్ క్లిక్, ఈజీ పే ఆప్షన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపిక చేసుకుని వాడకూడదు. అక్కడ మీ కార్డు వివరాలను సేవ్ చేయకూడదు. ప్రతి లావాదేవీకి పాస్వర్డ్ అడగడం, వన్ టైం పాస్ వర్డ్ పంపడం వంటివి సాగుతున్నాయో లేదో చూసుకోవాలి.
బ్యాంక్ నుంచంటూ వచ్చే ఈ మెయిల్స్‌కూ, ఫోన్కాల్స్కూ స్పందించి మీ వ్యక్తిగత వివరాలను చెప్పకూడదు. ఏ బ్యాంకూ కస్టమర్ నుంచి ఆ వివరాలను అడగవు. దీన్ని అందరూ గమనంలో ఉంచుకోవాలి.
మీరు వాడే కంప్యూటర్లో సురక్షితమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను లోడ్ చేసుకోండి. క్రాక్ వెర్షన్లను వినియోగించ కూడదు. సురక్షితమైన యాంటీ వైరస్లు హ్యాకింగ్ కార్యకలాపాలను సమర్థంగా అడ్డుకుంటాయి.
రోజువారీ నగదు వాడకంపై పరిమితి ఉన్న డెబిట్ కార్డుల వినియోగం మేలు.