ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన జరిపి ఈ రోజుకు ఏడాది పూర్తయింది. అప్పట్లో ఆయన మట్టి నీరు తప్ప మరేమీ తేకపోవడంపై దుమారం రేగింది. ఇప్పటికి అంతకన్నా పెద్దగా ఇచ్చిందేమీ లేదు.ఆ సంగతి అటుంచితే అమరావతిని ప్రపంచంలోని అయిదు నగరాల్లో ఒకటిగా చేస్తామనే అతిశయోక్తులు తప్పితే ఇంతవరకూ నిర్మాణానికి సంబంధించిన నిర్దిష్ట ప్రణాళికలేమీ తేలలేదు. వెలగపూడిలో కట్టిన సచివాలయం తాత్కాలికమో కాదో కూడా తెలియదు. కట్టాల్సిన హైకోర్టు శాసనసభ రాజ్‌భవన్ వంటివాటిపైనా స్పష్టత లేదు. ఉన్నా బయిటపెట్టలేదోమో తెలియదు. అంతా చూసుకుంటారన్న సింగపూర్ సింహాలేవీ ఇంకా సంచరించడం లేదు. ఆ రోజు చెప్పిన ప్రకారం ఈ ఏడాది మార్చినాటికే రైతులకు ప్లాట్ల పంపిణీ అయిపోయి వుండాలి.అదీ అరకొరగానే నడుస్తున్నది. కేంద్రం ఇచ్చిన 1800 కోట్లలోనూ వెయ్యికోట్లు విజయవాడ గుంటూరులకు పోతే 800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మరల్చినట్టు సమాచారం. పనులు కోల్పేయే వ్యవసాయ కార్మికుల్లోనూ దాదాపు మూడో వంతు మందికి మాత్రమే పెన్షన్లు మంజూరయ్యాయి. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, గృహ వసతి వంటివన్నీ ఇంకా వాగ్దానాలుగానే వున్నాయి. కోర్ కాపిటల్ సీడ్ క్యాపిటల్ వంటివన్నీ పదాలుగా మిగిలిపోగా ఇప్పుడు పరిపాలనా భవనాల నిర్మాణానికి మరో శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అది కూడా స్పష్టంగా చెప్పడం లేదు. మరో ఏడాదిలో ఎన్నికల జ్వరం వచ్చేస్తుంది. ఈలోగానే అన్నీ అయిపోతాయని ఎవరూ అనుకోలేదు గాని అసలు ఏం జరిగేది సూచనగా కూడా తెలియకపోవడం మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణమవుతున్నది.