అన్నయ్య అల్లు అర్జున్ బాటలోనే నడుస్తున్నాడు అల్లు శిరీష్. ఇటీవల లింగు స్వామితో సినిమా ఒప్పుకొని తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్దమయ్యాడు బన్నీ. వెంటనే శిరీష్ కూడా ఓ తమిళ దర్శకుడ్ని పట్టేసి, అక్కడ అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసుకొన్నాడు. అల్లు అర్జున్‌కి మలయాళంలో సూపర్ క్రేజ్ ఉంది. శిరీష్ సినిమా రిలీజ్ అంటే.. మల్లూ వుడ్ లోనూ హడావుడి మొదలైపోతుంది. అక్కడ కూడా తన ప్రతాపం చూపించడానికి సిద్దమయ్యాడు శిరీష్. మోహన్ లాల్‌తో కలసి ఓ సినిమాలో నటించి… మల్లూవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మోహన్ లాల్ కథానాయకుడిగా మేజర్ రవి దర్శకత్వంలో 1971 బియాండ్ బోర్డర్స్ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో అల్లు శిరీష్ ట్యాంక్ కమాండర్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మోహన్ లాల్‌తో కలసి నటించే ఛాన్స్ వచ్చినందుకు సంబరపడిపోతున్నాడు శిరీష్. ఇదే మల్లూవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సరైన సబ్జెక్ట్ అని భావిస్తున్నాడట. ఈ సినిమా పాకిస్థాన్‌కి వ్యతిరేకం కాదని, ప్రతీ భారతీయుడు గర్వపడేలా ఉంటుందని శిరీష్ చెబుతున్నాడు. యుద్ద నేపథ్యంలో సాగే సినిమానే అయినా హ్యూమన్ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారట. ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయనున్నారు.