సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి
పదివేల రూపాయల నోటు చూశారా.. ఎవరైనా.. చూసుండరు. చాలామంది. 1938, 1954ల్లో ఇవి భారత్లో ఇవి రాజ్యమేలాయి. 1948లో ఒకసారీ, 1978లో ఒకసారీ వీటిని రద్దుచేసింది ప్రభుత్వం. అత్యయిక పరిస్థితిని విధించి, ఘోరపరాజయం పాలైన ఇందిరాగాంధీని ఆర్థికంగా దెబ్బతీయడానికి జనతా ప్రభుత్వం 1978లో పదివేల రూపాయల నోటును రద్దు చేసింది. ఇప్పుడిదంతా ఎందుకంటారా.. తాజాగా 2వేల రూపాయల నోట్లు చలామణీలోకి రాబోతున్నాయట. హిందూ బిజినెస్ లైన్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. నల్లధనం నివారించాలంటే 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రధానికి లేఖ కూడా రాశారు. అది జరిగి పదిరోజులయ్యిందో లేదో గానీ, ఇప్పుడీ వార్తొచ్చింది. ఆ కథనం ప్రకారం మైసూరులోని రిజర్వ్ బ్యాంక్ ముద్రణ శాలలో వీటి ప్రింటింగ్ కూడా పూర్తయ్యిందట. వాటిని చలామణీలోకి తేవడానికి కేంద్రం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారుట. ఈ కథనాన్ని అటు కేంద్రం గానీ, ఇటు రిజర్వు బ్యాంకు అధికారులు కానీ ఖండించనూ లేదు.. సమర్థించనూ లేదు. అంటే ఎంతో కొంత వాస్తవం ఉండే ఉంటుంది. నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్న కేంద్రం యత్నాలు పూర్తిగా సఫలం కాలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నగదు నిల్వలకు జతయిన నోట్లలో 500, 1000 నోట్లు 85శాతం ఉన్నాయట.
నోట్ల తయారీలో ఆసక్తికర అంశాలిలా ఉన్నాయి. కరెన్సీ నోట్ల తయారీకి పత్తి, పత్తి పీలికలను ఉపయోగిస్తారు. ఆర్థిక ప్రగతి, ద్రవ్యోల్బణం, అవసరం, మార్పిడిని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ చేసే ప్రతిపాదనలను పరిశీలించి అందుకు సంబంధించిన అనుమతిని కేంద్రం ఇస్తుంది. నాసిక్, దేవాస్, మైసూర్, సల్బొని పట్టణాల్లో నోట్లను ముద్రిస్తారు. హైదరాబాద్, ముంబై, నోయిడా, కలకత్తాలలో నాణేలను ఆర్బీఐ ముద్రిస్తుంది. అహ్మదాబాద్, బెంగళూరు, బెలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం పట్టణాలనుంచి కరెన్సీ నోట్లను వివిధ బ్యాంకులకు అందిస్తారు. కోచిలోనూ, ఇతర ప్రాంతాలలోనూ కరెన్సీని భద్రపరచడానికి చెస్ట్లను ఏర్పాటు చేశారు. ఇవి కాక ప్రస్తుతం 50 పైసలు, రూపాయి, ఐదు, పది రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. పైస, 2,3,5,10,20,25పైసల నాణేల చలామణీని 2011 జూన్ 30నుంచి ఆర్బీఐ నిషేధించింది.