కొన్ని సినిమాలంతే. విడుదల తేదీ ప్రకటించడం తప్ప… రావడం ఉండదు. ‘సారీ.. ఈసారీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సివస్తుంది’ అంటూ ఓ స్టేట్మెంట్ తాయితీగా వస్తుంది. నాగచైతన్య కెరీర్లోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఆటోనగర్ సూర్య కనీసం అరడజను సార్లు రిలీజ్ డేట్లు మార్చారు. వాయిదా పడుతూ, లేస్తూ వచ్చిన ఆ సినిమా రిలీజ్ అయ్యాక యథావిధిగా డింకీ కొట్టింది. ఇప్పుడు అదే సీన్… ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాకీ రిపీట్ అవుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. నవంబరు 11న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. తెలుగులో ఎలాంటి సమస్యా లేదని, అయితే తమిళంలోనే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఈసినిమాని విడుదల చేయలేకపోతున్నామని, అవన్నీ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై రూ.22 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారట. ప్రేమమ్ విడుదలై.. సూపర్ హిట్ అనే టాక్ వచ్చినా రూ.20 కోట్లు దక్కించుకోలేకపోయింది. మరి.. పడుతూ లేస్తూ వచ్చే ఈ సినిమా ఎంత వరకూ ప్రభావితం చేస్తుందో చూడాలి. అసలు ఈసారైనా వస్తుందా, లేదంటే… ఎప్పటిలా ‘కుదరడం లేదు’ అంటూ తప్పించుకొంటారా అనేది చూడాలి. అదే జరిగితే ఈ సినిమా టైటిల్‌కి ‘సాహసం శ్వాసగా ‘ఆగిపో’ అంటూ పేరడీలు పెట్టేస్తారేమో??