“ఇప్పటికిప్పుడు” ఎన్నికలు జరిగితే… ఈ పదాన్ని తగిలించి ఎలాంటి సర్వే రిపోర్ట్ వండి వార్చినా చెల్లిపోతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎలాగూ జరగవు. కాబట్టి ఇది నిఖార్సయిన సర్వే అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో అంకెలు మారినా, ఆనాటి పరిస్థితుల్లో… అంటూ సమర్థించుకోవచ్చు. నమస్తే తెలంగాణ పత్రిక వారు తెరాస సర్కారుపై జరిగిన ఓ సర్వే వివరాలను చాలా సమగ్రంగా ప్రచురించారు.
సర్వే రిపోర్టులో హైలైట్ ఏమిటంటే సంక్షేమ పథకాల అమలుపై 58.54 శాతం మంది సంతృప్తితోఉన్నారట. రైతు రుణమాఫీ అన్నదాతకు లబ్ధి కలిగించలేక పోతోంది. దశల వారీగా కొద్ది కొద్దిగా నిధులు విడుదల చేయడంతో కొత్త రుణాలకు భరోసా లేకుండా పోయింది. రెండు పడక గదుల ఇళ్లు పత్తా లేవు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు తరచూ బ్రేకులు పడుతున్నాయి. విద్యార్థుల పీజు రీయింబర్స్ మెంట్ కుంటుతూ నడుస్తోంది. ఇంకా అనేక పథకాలదీ అదే దారి. అయినా అంత మంది సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే సారాంశాన్ని ఘనంగా చాటడం విశేషమే.
ఈ సర్వేలో చాలా చమక్కులు కనిపిస్తాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయంలో తారతమ్యాలుంటాయి. అయితే నమస్తే తెలంగాణ వారు ఘనంగా ప్రకటించిన సర్వే వివరాల్లో గంప గుత్తగా శాసనసభ్యులందరూ ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. సదరు సర్వే నివేదిక ప్రకారం తెరాస ఎమ్మెల్యేలందరూ 64.25 శాతం ప్రజాదరణ చూరగొన్నారట. సాధారణంగా అంత మంది ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు కొందరు డిస్టింక్షన్ మార్కులు తెచ్చుకుంటారు. కొందరు చాలా వెనకబడి ఉంటారు. ఇది సహజం. కానీ తెరాస బంగారు తెలంగాణ పాలనలో ఎమ్మెల్యేలు అందరూ ఫస్ట్ క్లాస్ స్థాయిలోప్రజా సేవలో తరిస్తున్నారట.
మొత్తానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే (ఎలాగూ జరగవు) మొత్తం 119లో తెరాసకు 109 సీట్లు ఇచ్చేశారు సర్వే నిర్వాహకులు. ఎం ఐ ఎం మిత్రపక్షం కాబట్టి వాళ్లు నారాజ్ కావద్దని అనుకున్నారేమో. వాళ్ల 7 సీట్లను వాళ్లకే వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు ఉదారంగా ఓ రెండు సీట్లిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సున్నా అంటే బాగుండదని అనుకున్నారేమో ఓ సీటు వాళ్ల ఖాతాలో వేసేశారు. టీడీపీ సహా మిగతా పార్టీలకు ఒక్క సీటూ రాదని తేల్చేశారు.
ఈ సర్వేలో మరో గమ్మత్తు ఉంది. ప్రతిపక్షాల్లో ఏ పార్టీకి ఎన్ని చోట్ల డిపాజిట్ రాదో కొన్ని అంకెలు వేసి మన ముందుంచారు. టీడీపీకి 114 సీట్లలో డిపాజిట్ గల్లంతు అవుతుందట. బీజేపీకి 108 చోట్ల డిపాజిట్ రాదట. వైసీపీకి 118 చోట్ల, కాంగ్రెస్ కు 62 సీట్లలో డిపాజిట్ గల్లంతు అవుతుందట. పోలైన ఓట్లలో నిర్ణీత శాతం ఓట్లు పొందడాన్ని బట్టే డిపాజిట్ దక్కడం దక్కక పోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా తెలియకుండా ఏవో అంకెలు వేశారని మనకు అర్థమైతే అది మన తప్పు కాదు.
సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అనే సంస్థ ఈ ఘనమైన సర్వేను నిర్వహించిందట. సర్వేల రంగంలో ఈ పేరు పెద్దగా విన్నట్టు లేదే అన్న అనుమానం కలిగితే అది కూడా మన తప్పు కాదు!!