టాలీవుడ్‌ని ఓ రేంజులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది బాహుబలి సినిమా. కనీవినీ ఎరుగని వసూళ్లతో తెలుగు సినిమా స్థాయికి పది రెట్లు పెంచింది. బాలీవుడ్ సినిమాలకు ధీటుగా కలక్షన్లు రాబట్టి.. రూ.600 కోట్ల మైలు రాయి అందుకొంది. మరి బాహుబలి 2 ఎంత సాధిస్తుంది? ఈసినిమా స్టామినా ఎంత? వీటిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. బాహుబలితో పోలిస్తే రెండో భాగానికి కనీసం 40 శాతం ఎక్కువ బిజినెస్ జరగబోతోందని జక్కన్న చెప్పేశాడు. ఆ లెక్కన చూస్తే దాదాపుగా రూ.800 కోట్ల వరకూ వసూలు చేసే ఆస్కారం ఉంది. ఈ వసూళ్లపై రానా కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. బాహుబలి 2 కనీసం రూ.600 కోట్లు తెస్తుందని ఓ లెక్క వేశాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రానా బాహుబలి వసూళ్లపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. బాహుబలి తొలి భాగం ఆరొందలు సాధించింది… రెండో భాగం కూడా అంతే తెచ్చుకొనే అవకాశాలున్నాయి.. ఈ అంకె పెరిగినా పెరగొచ్చు.. అంటున్నాడు రానా.
బాహుబలి… ఓ మ్యాజిక్. ఈ సినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. సినిమాలు మానేసి, ఇంటికే పరిమితమైన వాళ్లు కూడా బాహుబలిని చూడ్డానికి థియేటర్ల ముందు క్యూ కట్టారు. తెలుగు సినిమాకి బాలీవుడ్లో రూ.100 కోట్ల వసూళ్లు బాహుబలితోనే సాధ్యమైంది. దాంతో.. ఊహకు అందని వసూళ్లొచ్చాయి. బాహుబలి 2కి కూడా అదే మ్యాజిక్ జరుగుతుందా? అనే అనుమానాల్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి కంటే బాహుబలి 2 పది రెట్ల గొప్పగా ఉంటేనే తప్ప.. ఆ అంకెల్ని దాటడం అసాధ్యమన్నది వాళ్ల మాట. అయితే.. రాజమౌళి అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొన్నట్టు అర్థమవుతోంది. తొలి భాగానికి మించిన యుద్ద సన్నివేశాల్ని, విజువల్ ట్రీట్నీ చూపించబోతున్నాడట. అందుకే రానా కూడా ధీమాగా రూ.600 కోట్లు కొల్లకొట్టడం ఖాయం అంటున్నాడు. అతని ఊహ నిజమైతే.. సూపరేగా.