టాలీవుడ్లో ఇప్పుడో వార్త చక్కర్లు కొడుతోంది. బ్రహ్మానందం హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నాడని, ఇందులో రేష్మి, అనసూయ కథానాయికలుగా నటించబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. మరికొందరు ముందుకేసి ఈసినిమాకి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరిస్తారని.. యాడింగులు చేశారు. ఈవిషయమై తెలుగు 360. కామ్ బ్రహ్మానందాన్ని ఆరా తీసింది. అసలు అలాంటి ప్రతిపాదనే తన దగ్గరకు రాలేదని, ఇవన్నీ ఉతుత్తి గాసిప్పులని కొట్టిపరేశారాయన.
”హీరోగా చేస్తున్నాననడంలో ఎలాంటి నిజం లేదు. రేష్మి, అనసూయ హీరోయిన్లుగా నటిస్తున్నారనడం నేనూ కొత్తగా వింటున్నా. త్రివిక్రమ్‌తో కలసి, ఆయనతో మాట్లాడి చాలా కాలం అయ్యింది. ఇక ఆయన నిర్మాతగా వ్యవహరించడం ఏమిటో?” అంటూ నవ్వేశారు బ్రహ్మానందం.
అయితే బ్రహ్మానందం కోసం దర్శకుడు రమేష్ వర్మ ఓ కథ పట్టుకొని తిరుగుతున్నాడట. అందులో బ్రహ్మానందమే హీరో. ఆ కథనీ బ్రహ్మీ తిప్పి పంచించేశారని టాక్. బ్రహ్మీకి మళ్లీ హీరోగా నటించే ఉద్దేశమే లేదని క్లియర్ కట్‌గా తెలిసిపోయింది. పైగా డైరెక్షన్ విషయంలో బ్రహ్మీ ముందు నుంచీ విముఖంగా నే ఉన్నారు. ‘జఫ్ఫా’కి ముందూ బ్రహ్మీపై ఇలాంటి రూమర్లే వచ్చాయి. ఆ సినిమాకి బ్రహ్మానందమే డైరెక్టర్ అని చెప్పుకొన్నారు. అయితే.. ఆ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు పోషించింది… వెన్నెల కిషోర్. ”దర్శకత్వం గురించి నాకు తెలీదు. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ నన్ను నేను డైరెక్టర్‌గా ఊహించుకోలేను” అని తేల్చేశారు బ్రహ్మీ. అంటే ఇవన్నీ రూమర్లేఅన్నమాట.