భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మధ్య తేడా ఏమిటంటే ఒకసారి తనపై నిందలు వేసిన వారిని మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరట. ఏదో విదంగా వెంటాడి వేటాడుతూనే వుంటారట. తమ పార్టీ పితామహుడు ఎల్.కె.అద్వానీనుంచి ప్రస్తుత ఎంపి వరుణ్‌గాంధీ వరకూ అందరిపట్ల ఆయన అలాగే వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్ ఎంపి ఒకరు ఇష్టాగోష్టిగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ వ్యక్తిగతంగా తనను దూషించిన వారిని కూడా పార్టీలో చేరతామంటే ఆహ్వానించారని అదే మోడీ వారిని శంకగిరి మాన్యాలు పట్టిస్తే గాని ఆయనకు నిద్రరాదట. అలాగే ప్రతిక్షణం తనకు రాజకీయంగా ఏది లాభం ఏది నష్టం అని లెక్కవేసుకుని గాని అడుగు వేయరట. అదే కెసిఆర్ అయితే తనను విమర్శించడమే గాక విషం కక్కిన వారిని కూడా చేర్చుకుని ప్రాధాన్యత కల్పించారని ఆ ఎంపి చెప్పారు. వ్యక్తుల విషయంలో కెసిఆర్ చాలా పట్టువిడుపులు ప్రదర్శిస్తారని, గతాన్ని మనసులో పెట్టుకోకుండా ప్రోత్సాహం అందిస్తారని ఆయన ఉదాహరణలు చెబుతున్నారు.అయితే గతంలో తిట్టిన వారు అవసరాల కోసం దగ్గరకు వస్తే అది ఆయనకు లాభమే తప్ప నష్టం కాదుకదా అని ఆ సమయంలో మాతో వున్న ఇతర పార్టీల వారన్నారు. అలాటివారిని ఒకసారి క్షమించి చేర్చేసుకుంటే ఒక వ్యతిరేకి నోరు మూయించడమే గాక తర్వాత కాళ్లదగ్గరే పడివుంటారని కెసిఆర్‌కు బాగా తెలుసని కాంగ్రెస్ టిఆర్ఎస్ సీనియర్ నేతలు చమత్కరించారు. కెసిఆర్ జనంలోంచి వచ్చిన నాయకుడు కావడం,మోడీ ఆరెస్సెస్ నుంచి దూకి హఠాత్తుగా ప్రధాని పీఠం ఎక్కడం చాలా భిన్నమైన వ్యక్తిత్వాలకు దారితీశాయని అక్కడ చర్చ వచ్చింది. అలాటి తేడానే ఎన్టీఆర్‌కు చంద్రబాబుకూ కూడా వుంటుందని గతంలో ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పారు. ఏది ఏమైనా ఇది వ్యక్తుల సమస్యగా కంటే వారి నేపథ్యాలు రాజకీయ పరిస్తితుల ప్రభావంగా చెప్పుకోవడం ఉచితంగా వుంటుంది.