తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటుల పరిస్థితి అంతే. తెరపైన కంటే కూడా తెరవెనుకే బ్రహ్మాండంగా నటించగలరు. కొంతమంది మాత్రం తమ ఒరిజినల్ టాలెంట్ ఏంటో తెలుసుకోలేక కాస్త తికమక పడుతూ ఉంటారు. అలాంటి వారిలో మంచు లక్ష్మిని ప్రథమంగా చెప్పుకోవాలి. సినిమాల విషయం పక్కన పెడితే… బుల్లితెరపైన, ఫంక్షన్స్‌లోనూ అలాగే ఇంకా చాలా చాలా ఈవెంట్స్‌లో కూడా మంచు లక్ష్మీ చేసే కామెడీ మామూలుగా ఉండదు. అఫ్కోర్స్…ఒక్కోసారి ఆవిడగారు చాలా సీరియస్‌గానే మాట్లాడుతూ ఉంటారనుకోండి. కానీ మనకే పొట్ట చెక్కలయ్యే స్థాయిలో నవ్వు వస్తుంది. తెలుగు స్పూఫ్ వీడియోస్‌లో మంచు లక్ష్మివి కూడా కాస్త భారీ స్థాయిలోనే ఉన్నాయి. గుండెల్లో గోదావరి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మంచు లక్ష్మి మాట్లాడిన మాటలతో చేసిన కామెడీ వీడియో అయితే యూట్యూబ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ రేంజ్ హిట్ సినిమా ఇంతవరకూ మంచు లక్ష్మికి రాలేదు. అలాంటివి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఓ మంచి కామెడీ వీడియోకి కావాల్సిన కథను అందించింది మంచు లక్ష్మి. బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ కోసం రాజమౌళి తనను అడిగారని వీర లెవెల్లో కామెడీ డైలాగ్స్ పేల్చింది. స్టూడెంట్ నంబర్ ఒన్ సినిమా నుంచీ బాహుబలి వరకూ చూసుకుంటే రాజమౌళి క్యాస్టింగ్ సెలక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుందని ఎవరైనా చెప్తారు. మరి తాను ఎంతో ప్రేమించే శివగామి క్యారెక్టర్లో…అది కూడా ప్రభాస్, రానాలకు తల్లి క్యారెక్టర్లో మంచు లక్ష్మిని ఎలా ఊహించుకున్నాడో…ఎంత ఆలోచించినా అస్సలు అర్థం కావడం లేదు. పైగా పడి పడి నవ్వాలనిపించింది. అదీ మంచు లక్ష్మి టాలెంట్. ఎవ్వరినైనా నవ్వించెయ్యగలదు. కానీ మంచులక్ష్మి మాత్రం తనలో ఉన్న ఆ టాలెంట్‌ని గుర్తిచంలేక… సీరియస్ సినిమాలను నిర్మిస్తూ, వాటిలో తానే యాక్ట్ చేస్తూ అనవసరంగా చేతులు కాల్చుకుంటూ ఉంది.
ఇక స్పూఫ్, కామెడీ వీడియోస్ విషయంలో మంచు లక్ష్మి తర్వాత స్థానమో, లేకపోతే అంతకంటే ఎక్కువ స్థానమో బాలయ్యకే దక్కుతుంది. లెజెండ్ సినిమాతో 6 కోట్లు పోయాయని ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ అంతర్గత చర్చల్లో చెప్పారు. కానీ బాలయ్యబాబుకు మాత్రం లెజెండ్ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసినట్టు ఉంది. అందుకే అందరినీ హా…శ్ఛర్యానికి గురిచేస్తూ వెయ్యి రోజుల పాటు ఆ సినిమాను నడిపిస్తున్నాడు. రేపు వెయ్యి రోజుల ఫంక్షన్‌కి బాలయ్యబాబు అటెండ్ అవడం ఖాయం. ఇక అప్పుడు మన బాలకృష్ణుడు చేసే కామెడీకి నవ్వలేక…నవ్వీ నవ్వీ…ఎంత మంది ఎర్రగడ్డలో జాయిన్ అవుతారో చూడాలి మరి. అప్పుడెప్పుడో…అదేదో సినిమాలో… బాలయ్యబాబు తొడగొట్టడమో, చెయ్యి ఎత్తడమో చేసినప్పుడు ట్రైన్ ఆగిపోయిన హిలేరియస్ కామెడీ సీన్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కామెడీ ఈ వెయ్యి రోజుల పోస్టర్‌తోనే పండించాడు బాలయ్య. మధ్యలో ఎత్తులు, పల్లాలు స్పీచ్‌తో సహా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ చేసిన కామెడీల్లాంటివి మాత్రం మరీ ఈ స్థాయికి రాలేదు.
బాలకృష్ణ, మంచులక్ష్మిల శ్రేయోభిలాషిగా ఆలోచిస్తూ ఉంటే… ఓ విషయం ఎంతకూ బోధపడడం లేదు. ఈ ఇద్దరూ కూడా అద్భుతమైన కామెడీని పండించగలరు కదా. మరి ఎందుకని కామెడీ సినిమాలలో యాక్ట్ చేయడం లేదు. రాబోయే సినిమాలలో అయినా మంచు లక్ష్మి, బాలకృష్ణలిద్దరూ కూడా వెండితెరపైన అద్భుతమైన కామెడీని పండించి, తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే స్థాయి కామెడీ సినిమాలను మనకు అందించాలని కోరుకుంటూ…….
….. మీ ఆకాశ సీతక్క…..
గమనికః రాజమౌళి ప్రతిభను నమ్మి బాహుబలి-2 సినిమాను వందల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్వరూ కూడా మంచి లక్ష్మి మాటలను నమ్మి…భయపడవద్దని, రాజమౌళి టాలెంట్ పైన అనుమానాలు పెంచుకుని హార్ట్ ఎటాక్స్ తెచ్చుకోవద్దని మనవి. శివగామి క్యారెక్టర్ కోసం మంచు లక్ష్మిని తీసుకోవాలనుకున్న మాట నిజమే అని ఆయన నోట వస్తే మాత్రం…………..ఎహే….మన జక్కన్నను అనుమానించొద్దులే. అలా ఆలోచించి భయపడొద్దు.