తన 150వ సినిమా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొంటూనేఉన్నాడు చిరంజీవి. కథ, దర్శకుడు కోసమే రెండేళ్లకు పైగా నిరీక్షించాడు. సేఫ్ గేమ్ ఆడాలన్న ఉద్దేశంతోనే తమిళంలో సూపర్ హిట్టయిన ఓ సినిమాని రీమేక్ చేయాలని నిర్ణయించుకొన్నాడు. తన స్టైల్, మెగా అభిమానుల ఆశలు అంచనాలపై బాగా అవగాహన ఉన్న వి.వి.వినాయక్‌ని ఏరి కోరి దర్శకుడిగా పెట్టుకొన్నాడు. మాస్, కమర్షియల్ అంశాలన్నీ మేళవించి, అభిమానుల్ని అలరించడమే ధ్యేయంగా సినిమా తీస్తున్నాడు చిరు. ఇన్ని చేసినా.. ఎక్కడో తనకీ కొన్ని అనుమానాలు ఉన్నట్టున్నాయి. అందుకే మరింత అతి జాగ్రత్తతో.. ఈ సినిమా మేకింగ్ విషయంలోనూ జోక్యం చేసుకొంటున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
వినాయక్ అనుభవం ఉన్న దర్శకుడు. ఏ సీన్‌ని ఎలా తీయాలో తనకు బాగా తెలుసు. ఏ ఎమోషన్ని ఎలా పండించాలో ఇంకా బాగా తెలుసు. అయినా సరే.. చిరు వినాయక్‌ని పూర్తిగా నమ్మడం లేదన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రతీరోజూ.. రషెష్ చూసుకొని మార్పులు చెబుతున్నాడట. మరో వైపు మధ్య మధ్యలో సెట్లోకి వచ్చి.. నిర్మాతగా రామ్‌చరణ్ కూడా తనదైన మార్క్ చూపించాలన్న ఉద్దేశంతో సలహాలూ సూచనలూ ఇచ్చి పరేస్తున్నాడట. ఈ సినిమా మొత్తం జెమిని కిరణ్ కనుసన్నల్లో నడుస్తోంది. ఆయనా ఊరుకే కూర్చోక… బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడని టాక్. సీనియర్ కెమెరామెన్ అయిన రత్నవేలు కూడా షాట్స్ తనకు ఇష్టమొచ్చినట్టు పెడుతున్నాడని.. వీరంతా తన వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం వినాయక్‌కి ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఈ సినిమా నుంచి బయటపడాలని వినాయక్ భావిస్తున్నాడట. నిజానికి చిరు 150వ సినిమా భుజాలనెత్తుకోవడం వినాయక్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కొంతకాలం ‘కుదరడం లేదన్నయ్యా’ అని చెబుతూ కాలయాపన చేశాడట. అయితే.. ‘అఖిల్’ సినిమా డిజాస్టర్ అవ్వడం, చిరు మరీ బలవంతం చేయడంతో.. కత్తి రీమేక్ ని తలకెత్తుకోక తప్పలేదు. ఇలాంటి సినిమాల్ని హ్యాండిల్ చేయడం కత్తి మీద సామే. దాన్ని ఎంత తెలివిగా దాటుకొని వస్తాడో చూడాలి.