పండగ సీజన్‌ని క్యాష్ చేసుకోవడంలో తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ముందుంటుంది. సంక్రాంతి, దసరా, వినాయక చవితి, ఉగాది.. ఇలా దేన్నీ వదలదు. దీపావళికీ సినీ టపాసుల గోల ఎక్కువగానే వినిపిస్తుంది. అయితే ఈ దీపావళికి మాత్రం ఆశోభ లేదు. దీపావళి కోసం లైన్లో ఉన్న సినిమాలేవీ.. ఇప్పుడు బయటకు రావడం లేదు. దాంతో డబ్బింగ్ సినిమాలే అతీ, గతీ అయ్యాయి. ఈ దీపావళికి బాక్సాఫీసు ముందుకు రెండు సినిమాలొస్తున్నాయి. రెండూ డబ్బింగ్ బొమ్మలే. కార్తి నటించిన కాష్మోరా, ధనుష్ సినిమా ధర్మయోగి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిలో కాష్మోరానే కాస్త హడావుడి చేస్తోంది. పబ్లిసిటీతో మోత మోగిస్తోంది. ధనుష్ సినిమా ఎలాంటి హంగూ, ఆర్భాటాలూ లేకుండా బయటకు వస్తోంది.
దీపావళికి వస్తుందనుకొన్న మంచు లక్ష్మీ సినిమా లక్ష్మీబాంబ్ వాయిదా పడింది. నరేష్ సినిమా ఇంట్లో దెయ్యం నాకేం భయం కూడా వెనకడుగు వేసింది. నిజం చెప్పాలంటే ఓ మాదిరి సినిమాలకు ఇది మంచి టైమ్. పెద్ద సినిమాల హడావుడి లేనప్పుడే అవి బయటకు వస్తే… కొంతలో కొంతైనా మేలు జరిగేది. సుమంత్ సినిమా నరుడా డోనరుడా సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. ఈ దీపావళికి తీసుకొస్తే బాగుండేది కూడా. కానీ.. ప్రమోషన్లకు అట్టే టైమ్ లేకపోవడంతో దీపావళి ముగిశాక విడుదల చేద్దామనుకొంటున్నారు. గతవారం విడుదలైన సినిమా దేనికీ వసూళ్లు సరిగా లేక డీలా పడడం, ఈ వారం వచ్చేవి రెండూ డబ్బింగ్సినిమాలే కావడంతో ఈ దీపావళికి తెలుగు సినిమా బాక్సాఫీసు కళ తప్పినట్టైంది.