ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరిగా విదేశీ పర్యటనలకు వెళ్లి వస్తుంటారు. ప్రపంచదేశాలతో భారత్ సంబంధాలను మరింత బలపరచాలన్నది ఆయన ఆలోచన. ఇప్పుడు కాస్త జోరు తగ్గిందిగానీ, ఆ మధ్య అయితే కనీసం నెలకో విదేశీ పర్యటనకు వెళ్లేవారు ప్రధానమంత్రి. మోడీ పర్యటన అంటే ఆయన ఒక్కరే విమానమెక్కి వెళ్లిపోలేరు కదా! ప్రోటోకాల్స్ ఉంటాయి, చాలామంది సిబ్బంది వెంట వెళ్లాల్సి వస్తుంది, ఆయన కోసం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది, సిబ్బందికి భోజనాలు, వసతి… ఖర్చు జాస్తీగానే ఉంటుంది! అయితే, ఈ ఖర్చు ఎంత అనేది ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంటుంది. దేశం కోసమే ప్రధాని విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఆ పర్యటనలకు అయిన ఖర్చు ఎంత అనేది భారతీయ పౌరుడికి తెలియాలి. అలా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలీ… సమాచార హక్కు చట్టం ఉన్నదే అందుకు కదా! అలా ప్రశ్నిస్తేనే… ప్రధాని పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది!
మోడీ విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలను ఇవ్వాలంటూ లోకేష్ బత్రా అనే సమాచర హక్కు కార్యకర్త విదేశాంగ శాఖను ఆశ్రయించారు. కానీ, ఆ వివరాలు బయటకి వెల్లడించలేం అని అధికారులు తిరస్కరించారు. భద్రతా కారణాల దృష్ట్యా వివరాలు ఇవ్వలేం అని కారణం కూడా చెప్పారు! ఇదే అంశమై సమాచార శాఖ ఛీప్ కమిషనర్‌కు కూడా అప్పీలు చేశారు. ఆ వివరాలు వస్తే, అందులో భద్రతాపరమైన అంశాలు ఏమున్నాయో తేల్చి ఓ నిర్ణయానికి రాగలుగుతామని సి.ఐ.సి. ఆర్కే మాధుర్ అన్నారు.
ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు భారీగా ఖర్చు అవుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఆ వివరాలు బయటపెడితే మరిన్ని విమర్శలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి, ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయినా, జరిగిపోయిన పర్యటనల ఖర్చుల వివరాలను ఇవ్వడంలో భద్రతాపరమైన ఇబ్బందులు ఏముంటాయన్నది ప్రశ్న? ఇంకోటీ, పౌరుడి చేతిలో బ్రహ్మాస్త్రం అని చెప్పిన సమాచార హక్కు చట్టానికి కేంద్రమే సరిగా స్పందించకపోతే ఏమనుకోవాలి..? ప్రధాని పర్యటనల ఖర్చుల వివరాలు అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేముంది..? దీర్ఘకాలంలో భారతదేశ అభివృద్ధి కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన వివరాలన్నీ దేశప్రజలకు తెలియాలి కదా.