కాలమాన పరిస్థితుల దృష్ట్యా కొన్ని అలవాట్లు, పద్ధతులు మనకు అలవడుతూ ఉంటాయి. వాటి చుట్టూ ఓ శాస్త్రాన్ని తయారు చేసుకునో, సాంప్రదాయం అని ముసుగువేసో బలవంతంగా ఆ చట్రంలో ఇరుక్కుపోతూ ఉంటాం మనం. ఆ బందిఖానాలో నుంచి మనల్ని బయటపడేసే ప్రయత్నం కొత్తగా ఎవరైనా చేసినా వాళ్ళవైపు భయంగా చూస్తాం. వాళ్ళ ఆలోచనల నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తాం. మొదట్లో భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ప్రకృతినే పూజించారు. భయమయితేనేమి, తెలియనితనం అయితేనేమి, మనకు మంచి చేస్తుందన్న మంచి ఆలోచనతో అయితేనేమి….కారణమేదైనా అందరూ కూడా ప్రకృతినే పూజించారు. అయితే ఆ తర్వాత్తర్వాత మాత్రం ఆ విశాల విశ్వంలో నుంచి బయటకు వచ్చి ఎవరి బొమ్మను వాళ్ళు తయారు చేసుకున్నారు. పద్ధతులు, అలవాట్లను కూడా మార్చుకున్నారు. అందులో మానవజాతికి శాపంగా పరిణమించిన వాటిలో ఓ అలవాటు, ఆలోచన ఏమిటంటే స్త్రీ బలహీనురాలు అని మన ప్రతి ఆలోచనలోనూ ఇంకిపోయేలా మనల్ని పెంచుతున్న విధానం. మతం ఏదైనా, ఏ దేవుడ్ని కొలిచేవారైనా ప్రపంచం మొత్తం కూడా ఈ పాపిష్టి ప్రక్రియలో భాగం పంచుకుంటోంది.
అలాంటి సంకుచిత, అపసవ్య ఆలోచనా మార్గం నుంచి మన ఆలోచనలను కొంతైనా మార్చేలా తనకంటూ ఓ ప్రత్యేకమైన, స్థిరమైన అభిప్రాయాలున్న ఫిల్మ్ డైరెక్టర్ క్రిష్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలలో కూడా స్త్రీల గురించి క్రిష్ చెప్పిన విషయాలు చాలా చాలా అర్థవంతంగా ఉంటాయి. అలాగే మన ఆలోచనా తీరును మార్చేంత ప్రభావవంతంగా కూడా ఉంటాయి. ఇప్పుడు తాజాగా తను తెరకెక్కిస్తున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కథ, ఆ సినిమా ప్రచారంలో భాగంగా ఆ సినిమాకు పనిచేస్తున్న అందరి పేర్లనూ తల్లి పేరుతో జతకలిపి ప్రచారం చేస్తున్న విధానం గొప్పగా ఉంది. ఈ తరం తెలుగు సినిమా డైరెక్టర్స్‌లో ఇంత గొప్ప ఆలోచనలు ఉండటం కాస్తంత అద్భుతమైన విషయమే అని కూడా అనిపిస్తుంది.
అలాగే ఇండియన్ క్రికెటర్స్ కూడా తమ జెర్సీలపైన సగర్వంగా తల్లిపేరును ముద్రించుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు రాణించడం వెనకాల ఉన్న ఆ మహిళల కృషి గురించి చెప్పడం చాలా గొప్ప విషయం. ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మేన్ అయ్యేంత సామర్ధ్యం ఉందని అందరి చేతా కీర్తింపబడుతున్న ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి తండ్రి ప్రేమ్ కోహ్లి 2006లోనే చనిపోయాడు. కోహ్లి తల్లి సరోజ్ కోహ్లినే విరాట్‌ని ఇంతటివాడిని చేసింది. అలాంటి మాతృమూర్తి గురించి తెలుసుకుంటేనే కదా మనకు స్త్రీ శక్తిసామర్థ్యాల గురించి ఇంకాస్త బాగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో మనకు పరిచయమైన చందూ మొండేటి గురించి చెప్పుకోవాలి. ఆ రెండు సినిమాలలోనూ మహిళల గురించి చందూ మనతో పంచుకున్న అభిప్రాయాలు, ఒక ఇంటర్య్యూలో తల్లి గురించి, భార్య గురించి, తన జీవితాన్ని, ఆలోచనలను గొప్పగా తీర్చిదిద్దిన మహిళల గురించి నిజాయితీగా మనతో పంచుకున్న ఆలోచనలూ పదిమందికీ చేరాల్సినవే. వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నవే. అందుకే గౌతమీ పుత్ర యూనిట్‌కి, చందూ మొండేటికి, ఇండియన్ క్రికెట్ టీంకి వేవేల అభివందనాలు.