పండుగలూ పబ్బాలూ అనేవి ప్రజలకు సంబంధించిన విషయాలు. వీటిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు! కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం పండుగల్లోకి కూడా అధికార పార్టీల చొరబాటు బాగా ఎక్కువైపోతోందనే చెప్పాలి. ప్రజల్ని సెంటిమెంట్స్కి కనెక్ట్ చేయడం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు బాగా తెలిసిన విద్య! రాష్ట్రంలో జరిగే ప్రతీ పండుగనూ ఓ అధికారిక కార్యక్రమంగా మార్చేశారు. భారీ ఎత్తున నిధులు కేటాయిస్తుంటారు. ప్రతీదీ ఓ రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా చేసేస్తుంటారు. సరిగ్గా, ఇదే ఎమోషనల్ పాయింట్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దృష్టి సారించినట్టున్నారు. అందుకే, ఏడాది పొడవునా ఉత్సవాలు అంటూ ప్రకటన చేసినట్టున్నారు.
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీలోని పవిత్ర సంగమ క్షేత్రం వద్ద దీపావళి పండుగ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన నరకాసుర వధ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజానికి, ఆ ప్రాంతాన్ని పవిత్ర సంగమం అంటూ కృష్ణా పుష్కరాల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించిందీ చంద్రబాబు సర్కారే. అక్కడ స్నానం చేస్తే మహాపుణ్యమంటూ చాటింపు వేశారు. సరే, ఇప్పుడు అదే ప్రదేశంలో దీపావళి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతృప్తికరంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఒకేసారి ప్రజలందరూ దీపావళి పండుగను జరుపుకోవాలని చంద్రబాబు అన్నారు! అందరూ ఒకేచోట దీపావళి జరుపుకోవడం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని కూడా చెప్పారు. ప్రజలందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామనీ, అందుకే రాష్ట్రంలో సంవత్సరమంతా వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు!
ప్రజలను సంతోషంగా ఉండాలంటే చేయాల్సినవి ఉత్సవాలూ పండుగలూ కాదు! మెరుగైన పాలన అందించాలి. అవినీతి ఆస్కారం లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆంధ్రాలో రాజధాని నిర్మించాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, యువతకు ఉపాధి చూపించాలి. అంతేగానీ, ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారా..? సెంటిమెంట్స్ పరంగా ప్రజలకు దగ్గరవడానికి మాత్రమే ఇలాంటి ప్రకటనలు ఉపయోగపడతాయి. అయినా, పండుగలూ ఉత్సవాలూ ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాల్సిన అవసరం ఏముంది..? ప్రజలు పండుగలు జరుపుకుంటూ ఉంటే.. వారికి కావాల్సిన సౌకర్యాలు మాత్రమే ప్రభుత్వాలు కల్పించాలి. అంతేగానీ, ఆ పండుగల్లోకి ప్రభుత్వాలే చొరబడటం లౌకిక స్ఫూర్తికి విరుద్ధం కాదా..!