ఈమధ్య స్టార్లు… సంపాదనమీదే కాదు, సామాజిక సేవపైనా దృష్టి పెట్టడం ఆనందాన్ని కలిగిస్తోంది. జేబులోంచి డబ్బులు తీయకపోయినా… ఏదో ఓ రూపంలో డబ్బు పోగేసి, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. దాదాపుగా మన టాప్ స్టార్లంతా ఏదో ఓ రూపంలో సంఘ సేవ చేస్తున్నవాళ్లే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ లిస్టులో చేరింది. ఫిట్ నెస్ అన్ ప్లగ్డ్ పేరుతో రకుల్ ఓ ఛారిటీకి శ్రీకారం చుట్టింది. నవంబరు 20న గచ్చిబౌలి స్టేడియంలో నాన్ స్టాప్‌గా 5 గంటల పాటు ఫిట్నెస్కి సంబంధించిన ఓ షో చేయబోతోంది రకుల్. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని అత్యాచార బాధితులకు అందజేయనుంది. ఇటీవల రకుల్ కొంతమంది రేప్ విక్టెమ్స్తో మాట్లాడింది. వాళ్ల సాధక బాధకాల్ని తెలుసుకొంది. వాళ్లను ఏదో ఓ రూపంలో ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ షోకి శ్రీకారం చుట్టింది. టాలీవుడ్ లోని మరికొంతమంది స్టార్లు… ఈ షోలో రకుల్‌తో పాటు జాయిన్ అవ్వనున్నారు. తన బిజీ షెడ్యూల్లో కొంత సమయం పక్కన పెట్టి.. ఈ షోకి టైమ్ కేటాయించనుందట రకుల్. దిన పత్రికల్లో, ఛానళ్లలో అత్యాచార బాధితుల గురించి తెలుసుకొన్న రకుల్ చలించిపోయిందట. ఈమధ్య వాళ్లని కలసినప్పుడు కూడా తన భావోద్వేగాలన్ని అణచుకోలేక కన్నీరు పెట్టుకొందట. ప్రతీ యేడాదీ ఇలా ఏదో ఓ రూపంలో ఛారిటీ నిర్వహించాలని కంకణం కట్టుకొంది రకుల్.