రవితేజ కు ఈ మధ్య సినిమాలపై ధ్యాస తగ్గింది. చుట్టూ ఎంత మంది దర్శకులు కథలు పట్టుకొని తిరుగుతున్నా కనికరించడంలేదు. కథలు విని… ఓకే చెప్పినా పట్టాలెక్కడం లేదు. దాంతో దర్శకులు విసిగి వేసారి పోయి.. మరో హీరోని పట్టుకొని ఓకే చేయించుకొంటున్నారు. అలా రవితేజ చేతిలోంచి చాలా సినిమాలు, చాలా కథలు చేజారిపోతున్నాయి. తాజాగా మరో సినిమా పక్కకు వెళ్లిపోయింది. రవితేజ కోసం వేణు శ్రీరామ్ ఓ కథ రెడీ చేశాడు. అది రవితేజకీ బాగా నచ్చింది. ఈ సినిమా కోసమే మనలో ఒకడు అనే పేరు రిజిస్టర్ చేయించారు కూడా. అయితే.. ఈ సినిమా ఎంతకీ పట్టాలెక్కడం లేదు. దాంతో వేణు శ్రీరామ్ రవితేజ కాంపౌండ్ నుంచి జంప్ అయిపోయి.. నాని దగ్గర వాలాడు.
ఈ కథ నానికి విపరీతంగా నచ్చడంతో…. ‘యస్’ చెప్పేశాడు కూడా. ఈ సినిమాకి దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం నాని దిల్రాజు బ్యానర్లోనే ‘నేను లోకల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సందర్భంగానే దిల్రాజు నానికి ఈ కథ వినిపించాడట. 2017 లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే నాని కోసం చాలా పెద్ద క్యూనే ఉంది. నాలుగైదు కథల్ని రెడీ చేసుకొన్నాడీ నేచురల్ స్టార్. అయితే అందులో ముందుగా ఏది వర్కవుట్ అవుతుందో నాని కూడా చెప్పలేని పరిస్థితి. పాపం… ఈ సినిమా నానితో తీయాలంటే వేణు శ్రీరామ్ ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు.