హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ కూల్చవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాగున్న భవనాలను కూల్చి కొత్తవాటిని నిర్మించడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని, దీన్ని అడ్డుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ భవనాల కూల్చివేత జరప వద్దని తేల్చి చెప్పింది. అయితే సచివాలయంలోని కార్యాలయాలను ఇతర భవనాలకు తరలించే విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
సచివాలయ ప్రాంగణంలో కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. భయంకరమైన వాస్తు దోషాల కారణంగా కొత్త భవనాల నిర్మాణం తప్పనిసరి అని కేసీఆర్ తన మంత్రులతో చెప్పారని వార్తలు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయానికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ.
ఏపీకి కేటాయించిన భవనాలను కూడా ఇప్పించాలని కేసీఆర్ ఇప్పటికే గవర్నర్ ను అనేక సార్లు కోరారు. వాటికి బదులు వేరే భవనాలను ఏపీకి ఇస్తామని తెలిపారు. దీంతో ఏపీ మంత్రివర్గం సోమవారం నాడు ఈ విషయాన్ని కూడా చర్చించింది. దీనిపై ఓ సబ్ కమిటీని వేయాలని నిర్ణయించింది. సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తమ అభిప్రాయాన్ని రాజ్ భవన్ కు పంపుతామని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది.
అయితే జీవన్ రెడ్డి పటిషన్ ను విచారించిన హైకోర్టు, తన ఆదేశాలను విస్పష్టంగా వెలువరించింది. కూల్చివేత నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఓ పెద్ద పరీక్షే ఎదురైంది. కొత్త సచివాలయం నిర్మాణానికి ప్రాథమిక అంచనా వ్యయం రూ. 300 కోట్లు. అయితే పనులు పూర్తయ్యే సరికి వెయ్యి కోట్ల దాకా ఖర్చవుతాయని, ఇది నిధుల దుబారా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రజాధనం విషయంలో ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవిస్తేనే కొత్త భవన నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందంటున్నారు న్యాయ నిపుణులు. లేకపోతే ఉన్న భవనాల కూల్చివేతకు కోర్టు అనుమతి ఇవ్వక పోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. చివరకు ఈ అంశంపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.