దర్శకుడిగా మారాక… ఒక్క హిట్టూ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు ఆర్పీ పట్నాయక్. అయినా వరుసగా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతన్నుంచి మరో సినిమా వస్తోంది.. అదే… మనలో ఒకడు. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మరో మూడు సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడు ఆర్పీ. మనలో ఒకడు సినిమాని కన్నడలో రీమేక్ చేస్తానంటున్నాడు. ఆ సినిమాకి గాలి జనార్థన్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తాడట.
”మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా తీస్తా. అందుకు సంబంధించిన కథ రెడీగా ఉంది. మరో రెండు కథలూ సిద్దం చేశా. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు దర్శకుడిగా సంతృప్తి నిచ్చాయి. సినిమా అనేది వినోద సాధనం. వినోదం అంటే నవ్వుకోవడం మాత్రమే కాదు. అదో ఎమోషన్. నా సినిమాలో కామెడీ ఉండకపోవొచ్చు. కానీ ఎమోషన్ తప్పకుండా ఉంటుంది. దాన్ని నమ్ముకొనే సినిమా తీస్తా” అంటున్నాడీ స్వరకర్త. మీ సినిమాల్లో మీరే ఎందుకు హీరోగా నటిస్తారు? అనే ప్రశ్నకూ సూటిగానే సమాధానమిచ్చాడు ఆర్పీ. ”నా సినిమాల్లో హీరోలు ఉండరు. అంతా సామాన్య వ్యక్తులే. కథలే హీరోలుగా మారతాయి. సామాన్యుడి పాత్రలకు స్టార్లు అవసరం లేదు. స్టార్లని పెట్టుకొంటే వాళ్లు తప్ప కథలు కనిపించవు” అని క్లారిటీ ఇచ్చాడు ఆర్పీ. అంటే ఇక ముందూ.. ఆర్పీ సినిమాల్లో ఆర్పీనే హీరో అన్నమాట. అందుకు మనం ప్రిపేర్ అయిపోయి సినిమా థియేటర్‌కి వెళ్లడం బెటర్.