మన పోలీసుల్లో ఎక్కువ మంది ప్రవర్తన కఠినాతి కఠినంగానే ఉంటుంది. పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాలంటేనే సామాన్యప్రజలు భయపడే పరిస్థితులు ఏర్పడడానికి కారణం అలాంటి పోలీసు స్టైల్ ప్రవర్తనే. ఇప్పటికీ కూడా డబ్బు బలం, అధికార బలంలేని సామాన్యులు చాలా ఎక్కువ మంది, ఎలాంటి తప్పూ చేయకపోయినా సరే, పోలీసులంటే చాలు… హడలిపోతూ ఉంటారు. ఇక పల్లె వాసుల గురించి అయితే చెప్పనవసరం లేదు. పోలీసులు గ్రామాల్లో అడుగుపెడితేనే చాలు… ఎక్కువశాతం మంది ప్రజలు భయంతో ఇళ్ళకే పరిమితమవుతూ ఉంటారు. ఆ భయాన్ని అడ్డుపెట్టుకునే మన పాలకులు కూడా 144 సెక్షన్ అనో, ఇంకోటనో పోలీసులను గ్రామాలకు పంపించి…. వాళ్ళ నిరంకుశ విధానాలను గ్రామస్తులు వ్యతిరేకించకుండా ఉండేలా దండోపాయాన్ని ప్రయోగిస్తూ ఉంటారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని పాలకులు చేస్తున్న ఇలాంటి దారుణాలను కళ్ళకు కట్టేలా చూపించడానికి మన మీడియా వారికి ధైర్యం చాలదు. ఇప్పుడున్న వాటిలో ఎక్కువ భాగం మీడియా సంస్థలు పొలిటికల్ పార్టీలకు భజన చేసేవే కాబట్టి… పోలీసులను అడ్డుపెట్టుకుని ఆ నాయకులు చేసే దారుణాలను ప్రజలకు తెలియచేసే ప్రయత్నాలు మాత్రం సమర్థవంతంగా చేయలేవు. కానీ అదే పోలీసువాళ్ళు మావోయిస్టులను చంపేసినప్పుడో, టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేసినప్పుడో మాత్రం మీడియావాళ్ళందరూ కూడా పోలీసులను రాక్షసులుగా చిత్రీకరించే ప్రయత్నాలకు పదును పెట్టేస్తారు. పదుల సంఖ్యలో పోలీసులను పొట్టనపెట్టుకున్న ‘బలిమెల’ లాంటి దుర్ఘటనలు కూడా అలాంటి సమయాల్లో మీడియా వాళ్ళకు అస్సలు గుర్తుకురావు. ఇప్పుడు టెర్రరెస్టుల ఎన్కౌంటర్ విషయంలో కూడా మీడియా రాతలు అలాగే ఉన్నాయి.
సెక్యూరిటీ గార్డును చంపేశారు, కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు నుంచి పారిపోయారు, అందరూ కరడుగట్టిన తీవ్రవాదులే…….అలాంటి వాళ్ళను పోలీసులు ఎలా ట్రీట్ చేయాలి? సినిమాల్లో చూపించినట్టుగా ఆ టెర్రరిస్టులు జైలు నుంచి పారిపోయేలా పోలీసులే చేసి…..ఆ తర్వాత బయట కాపు కాసి వాళ్ళను ఏసేశారని కూడా కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు. మరి సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులే చంపించి ఉంటారా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకోవడంలో విఫలమయ్యి ఉంటే ఇదే మీడియా వాళ్ళు పోలీసులను ఏ స్థాయిలో విమర్శించి ఉండేవాళ్ళో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం పోలీసులకు కూడా తెలుసు. అలాగే ఆ టెర్రరిస్టులు సెక్యూరిటీ గార్డును చంపేశారన్న విషయం కూడా తెలుసు. అందుకే రిస్క్ తీసుకోలేకపోయారు. ప్రాణాలతో పట్టుకునే అవకాశం వచ్చి ఉన్నా సరే….. దూరం నుంచి షూట్ చేసి పడేయడానికే నిర్ణయం తీసేసుకుని ఉంటారు. ఆ పోలీసులేమీ తెలుగు సినిమాల్లో చూపించే గబ్బర్‌సింగ్ లాంటి పోలీసులో, సాయికుమార్ లాంటి వాళ్ళో కాదు కదా. వాళ్ళకూ ప్రాణ భయం ఉంటుంది. ఆ టెర్రరిస్టులను ప్రాణాలతో పట్టుకోవడం కంటే కూడా తమ ప్రాణాలను కాపాడుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా అదే చేస్తారు. మీడియా వాళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నా అదే చేసి ఉండేవాళ్ళు. కానీ ఎన్కౌంటర్ జరిగిన మరుక్షణం నుంచి కూడా పోలీసులను తప్పు పట్టే ప్రయత్నాల్లో మాత్రం మీడియా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సాక్షిలాంటి తెలుగు న్యూస్ పేపర్‌తో సహా చాలా మీడియా సంస్థల్లో ఓ వీడియోని చూపిస్తున్నారు. ఆ వీడియోలో….‘ బతికే ఉన్నాడు…కాల్సి పారేయండి’ అన్న హిందీ మాటలు వినిపించాయి. మనుషులు మాత్రం కనిపించలేదు. ఆ వీడియో ఎప్పటిదో, ఎవరు షూట్ చేశారో కూడా తెలియదు. కానీ మాంచి మసాలా ఐటెం దొరికిందనుకున్నారో ఏమో కానీ పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌కి, ఆ వీడియోలో మాటలకు లింక్ కలిపేసి కథలు రాసేశారు. ఆ వీడియో నిజమైందా? కాదా? అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదని కూడా వాళ్ళే రాసేశారు. మరి పోలీసులను రాక్షసులుగా చిత్రీకరించాలన్న ఆ ఆత్రం ఎందుకు? అసలు సంఘవిద్రోహులను, టెర్రరిస్టులను చంపేసినప్పుడు మాత్రమే మనవాళ్ళకు మానవహక్కులు ఎందుకు గుర్తువస్తూ ఉంటాయి?
హైదరాబాద్, ఢిల్లీలాంటి మహా నగరాలతో పాటు ఎన్నో గ్రామాల్లో కూడా చాలా మంది జనాలు, ముఖ్యంగా మహిళలు…. ప్రతి రోజూ, ప్రతి క్షణం భయం భయంగానే బ్రతుకుతూ ఉన్నారు. ఏ తప్పూ చేయకపోయినప్పటికీ బయట అడుగుపెట్టినప్పటి నుంచీ ఇంటికి వెళ్ళే వరకూ భయపడుతూ ఉండే సామాన్యులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వ్యాపారస్తుల చేతుల్లో మోసపోయినప్పటికీ, మనసులోనే కోపాన్ని మౌనంగా భరిస్తూ, బ్రతుకులు ఈడుస్తూ ఉన్నవాళ్ళు మన కళ్ళముందే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ హక్కులు, స్వేచ్ఛ కూడా ప్రతిరోజూ హరించబడుతున్నట్టే కదా? ఈ మీడియా వాళ్ళకు వినియోగదారులుగా ఉంటూ వాళ్ళను బ్రతికిస్తున్నది కూడా అలాంటి వాళ్ళేగా. కానీ అలాంటి సామాన్య మానవుల హక్కుల గురించి, వాళ్ళు భయం మధ్య బ్రతుకుతున్న పరిస్థితుల గురించి మాత్రం మీడియాలో వార్తలు కనిపించవు. టెర్రరిస్టులు, రాజకీయ నాయకులు, జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళ హక్కుల గురించి అయితే బ్రేకింగ్ న్యూస్‌లు, లైవ్ కవరేజీలు, పేజీలకు పేజీల వార్తలు వండి వారుస్తూ ఉంటారు. సామాన్యుల హక్కులను కాపాడుతూ, వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికే అవకాశమున్న పరిస్థితులను కల్పించడంలో విఫలమవుతున్న పోలీసులకు…. కనీసం సంఘ విద్రోహులను శిక్షించడానికి అయినా ధైర్యం లేకుండాపోయేలా చేస్తున్నారు. టెర్రరిస్టులు ముంబైపైన ఎటాక్ చేసినప్పుడు మన మీడియా వార్తలు వాళ్ళకు ఏ విధంగా సహాయపడ్డాయో కళ్ళారా చూశాం. అలాగే కాశ్మీర్ అల్లర్ల విషయంలో కూడా మన మీడియా చేసిన ఓవర్ యాక్షన్ కాస్తా మన దేశానికి అంతర్జాతీయంగా సంకటస్థితినే తెచ్చిపెట్టింది. అలాంటివి ఇంకా ఎన్ని జరిగినప్పిటికీ ప్రజాప్రయోజనాలను ఎప్పుడో గాలికి వదిలేసి, ధన ప్రయోజనాల కోసమే నడుస్తున్న కొన్ని మీడియా సంస్థల నడత మారదేమో. సంఘవిద్రోహ శక్తుల హక్కులు, స్వేచ్ఛ గురించి చెప్పడం కాస్త తగ్గించి సాధారణ పౌరుల బ్రతుకు భయాల గురించి వార్తలు రాయరేమో?