ప్రభుత్వంలో ఉన్నవారు స్వామికార్యం, స్వకార్యం అన్నట్టుగా ప్రవర్తించడం కొత్త కాదు. అధికారంలో ఉన్న వారు ఓట్ల కోణంలనూ ఆలోచించడం సర్వ సాధారణం. అయితే ఓట్ల కోణంలో ఆలోచించి కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్టు అందుకు సార్థకత ఉండాలి. ఎవరి కోసమైతే ఆ నిధులను ఖర్చుచేస్తున్నారో వారికైనా మేలు జరగాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అలా మేలు కలుగున్నట్టు లేదు.
వ్యవసాయ రంగంపై నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకుల్లో ఏపీ 7, తెలంగాణ 8వ ర్యాంకు సాధించాయి. జాబితాలో టాప్ 5లో నిలిచిన రాష్ట్రాలన్నీ బీజేపీ అధికారంలో ఉన్నవే అనేది రాజకీయ కోణం. రైతు కోణంలోంచి చూస్తే, ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఉచిత విద్యుత్ విధానం అమల్లో లేదు. రైతు రుణమాఫీ జరగలేదు. అటు ఉచిత్ విద్యుత్తుకు, ఇటు రుణమాఫీకి వేల కోట్ల భారాన్ని మోస్తున్న తెలుగు రాష్ట్రాలు మాత్రం టాప్ 5లో చోటు దక్కించుకోలేదు. ఉచిత విద్యుత్ పథకం అమల్లో ఉన్న మరో రాష్ట్రం పంజాబ్ పరిస్థితి మరీ దయనీయమని నీతి ఆయోగ్ నివేదిక తేల్చింది. అక్కడా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే ఉంది.
జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఉచిత విద్యుత్ పథకం లేదు. అక్కడ రైతులకు విద్యుత్ బిల్లులపై సబ్సిడీ ఇస్తారు. టాప్ 5 లో ఉన్న మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఉచిత విద్యుత్ అమల్లో లేదు. పైగా రైతుల రుణాలను మాఫీ చేయలేదు. అయినా అక్కడి రైతులు మన కంటే బాగున్నారని నీతి ఆయోగ్ జాబితా చెప్తోంది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉచిత విద్యుత్ విధానం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వాలు వేల కోట్ల భారాన్ని మోస్తున్నాయి. అలాగే 2014 ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చినందున ఇటు కేసీఆర్ సర్కార్, అటు చంద్రబాబు ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేస్తున్నాయి. అయితే ఒకేసారి రుణమాఫీ చేయక పోవడం వల్ల చాలా మంది రైతులకు మంచికి బదులు చెడే జరిగింది. కొత్త అప్పులు దొరకడం కూడా చాలా మంది రైతులకు కష్టమైపోయింది.
ఇన్ని వేల కోట్ల భారాన్ని భరిస్తూ రైతులకు మేలు చేస్తున్నామని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ గొప్ప చెప్పుకుంటున్నాయి. కానీ రైతులు ఎందుకు సంతోషంగా లేరు? ఈ రాష్ట్రాలు జాబితాలో అగ్ర స్థానంలో ఎందుకు లేవనేది ఆలోచించాల్సిన విషయం. రైతు ఆత్మహత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రైతులకు అనేక సమస్యలున్నాయి. ఏ రైతు కోసం వేలకోట్ల భారం భరిస్తున్నారో, ఆ రైతు సంతోషంగా లేనప్పుడు అన్ని కోట్లూ వృథాయేనా? ఇకముందైనా ఇలా జగరకుండా రైతును రాజును చేయడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సరైన దిశలో ఆలోచించి పనిచేస్తాయేమో చూద్దాం.