కమల్ హాసన్-గౌతమి విడిపోయారు. వివాహ బంధం లేకపోయినప్పటికీ 13 సంవత్సరాలుగా ఒకళ్ళకోసం ఒకళ్ళు అనే స్థాయిలోనే కలిసున్నారు ఈ జంట. రకరకాల ఊహాగానాలు చేసే అవకాశం మీడియాకు ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సినిమా సెలబ్రిటీలు. కొన్ని సంచలన విషయాలను ముందుగానే వాళ్ళే చెప్పేస్తున్నారు. గౌతమి కూడా కమల్‌తో విడిపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో తనే చాలా వివరంగా చెప్పేసింది. దాంతో విడిపోయారా…? లేదా…? అంటూ ఊహాగానాలు చేసే అవకాశం మీడియాకు లేకుండా చేసింది. అయినప్పటికీ మీడియా వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? ఇంతటి మసాలా ఫుడ్‌ని వాళ్ళెలా వదులుకుంటారు?
అందుకే గౌతమి-కమల్‌లు విడిపోవడానకి కారణం ఏంటి? విడగొట్టిన వారు ఎవరు? అని మాంచి మాంచి కథలు రాయడం స్టార్ట్ చేశారు. పవన్-రేణూదేశాయ్‌ల విషయంలో కూడా ఎందుకు విడిపోయారో వాళ్ళిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కానీ మీడియా మాత్రం రకరకాలుగా రాసేసింది. పవన్‌పైన అభిమానం ఉన్న వాళ్ళు పవన్‌ని హీరోని చేసేసి, రేణూదేశాయ్‌ని డబ్బు మనిషిగా చిత్రీకరించి పడేశారు. అమలాపాల్-విజయ్‌ల విడాకుల గురించి కూడా బోలెడన్ని కథలు వినిపించాయి. ఇప్పుడిక కమల్‌తో విడిపోయిన విషయం గురించి గౌతమి అధికారికంగా చెప్పిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఓ పసందైన కథ బయటకు వచ్చింది. గౌతమి, శృతీహాసన్లకు ఏదో గొడవ అయిందట. గౌతమిగారు తన గురించి తాను కాస్త ఎక్కువ ఊహించుకుని నేనా…? శృతినా….? అని కమల్ హాసన్‌ని ఘాఠ్ఠిగా నిలదీసిందట. క్యా సీన్ హై? తెలుగు సినేమా రచయితల క్రియేటివిటీ స్థాయికి మన జర్నలిస్టుల ఊహాగానాలు కూడా ఏ మాత్రం తగ్గవు. తళ్ళా? పెళ్ళామా? అనే ప్రశ్నలా గౌతమినా? శృతినా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం కోసం టాలెంటెడ్, క్రియేటివ్ జీనియస్ అయిన కమల్ హాసన్ నిద్రాహారాలు లేకుండా ఆలోచించాడట. ఫైనల్‌గా శృతీహాసనే అని సమాధానం చెప్పేశాడట కమల్. టాట్…..అని గట్టిగా అరిచేసిన గౌతమి….అయితే నేను జంప్….అని ఇంట్లోంచి బయటకు వచ్చేసిందట. కమల్-గౌతమి బ్రేకప్‌కి సంబంధించి బయటకు వచ్చిన మొదటి కథ ఇదే. ఇంకా ఎన్ని కథలు వస్తాయో చూడాలి మరి.