సుమంత్ డీసెంట్ యాక్టరే. వెనుక దిమ్మతిరిగే బ్యాక్ గ్రౌండ్ ఉంది. సొంతంగా సినిమాలు తీసుకోగలడు. కానీ.. రెండేళ్లు సినిమాలేం చేయకుండా ఖాళీగా ఉండిపోయాడు. ఇప్పుడు.. నరుడా డోనరుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ టైటిల్, దానికి తగ్గట్టుగా సాగుతున్న ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాపై సుమంత్ కూడా చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. శుక్రవారం నరుడా.. డోనరుడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుమంత్‌తో తెలుగు 360 చేసిన చిట్ చాట్ ఇది.
హాయ్.. సుమంత్
హాయ్..
చాలా గ్యాప్ తీసుకొన్నారే…
అవునండీ.. తీసుకోవాల్సి వచ్చింది. అయితే సినిమాలకు దూరం కావాలన్న ఉద్దేశంతో కాదు. ఈ మధ్య చాలా కథలు విన్నా. అయితే అన్నీ రొటీన్‌గానే అనిపిస్తున్నాయి. ఓ ఫైట్, ఓ పాట.. ఇలా సాగిపోతున్నాయి. అలాంటి కథలు చేయడం కంటే, ఖాళీగా ఉండడం బెటర్ అనుకొన్నా.
మరి విక్కీడోనర్ రీమేక్ ఆలోచన ఎందుకు వచ్చింది?
నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా చూశా. చాలా బాగుంది.. అనిపించింది. తాతగారు కూడా ఈ సినిమా చూసి `ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తే బాగుంటుంది` అన్నారు. నాకూ నిజమే అనిపించింది. కొంతమంది దర్శకుల్ని పిలిపించి.. ఈ టైపు కథలు ఉంటే చెప్పమన్నాను. కానీ… ఫలితం దక్కలేదు. రీమేక్ చేద్దామనుకొంటే, అప్పటికే ఈ సినిమాని ఎవరో రీమేక్ చేస్తున్నట్టు తెలిసింది. అందుకే కామ్‌గా ఉన్నా. కొన్నాళ్లకు ఈ రైట్స్ జాన్ అబ్రహాం దగ్గరే ఉన్నాయని తెలిసింది. తను నాకు బాగా తెలుసు. ఫోన్ చేసి అడిగే సరికి.. సంతోషంగా రైట్స్ ఇచ్చాడు. తక్కువ రేటుకే.
నాలుగేళ్ల క్రితం కథ ఇది.. మరీ ఓల్డ్ అయిపోతుందేమో..
లేదండీ.. ఇలాంటి కథలు ఎప్పుడు చెప్పినా ఫ్రెష్‌గా ఉంటాయి. పైగా ఈ తరహా సినిమాలు తెలుగులో రాలేదు.
స్పెర్మ్ డొనేషన్ అనేది బోల్డ్ సబ్జెక్ట్. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి సరితూగుతుందంటారా?
కచ్చితంగా. బోల్డ్ సబ్జెక్ట్ అయినా.. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీశాం. ఎక్కడా హద్దు దాటలేదు. పైగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారింది. కొత్త తరహా కథలకు పట్టం కడుతున్నారు. సో.. ఆ విషయంలో బెంగ లేదు.
ట్రైలర్లు చూస్తుంటే కామెడీ మీద ఫోకస్ బాగా పెట్టినట్టు అనిపిస్తుంది…
ఇలాంటి కథని సున్నితంగానే డీల్ చేయాలి. అలాగని కేవలం కామెడీ మాత్రమే ఉండదు. నా సినిమాల్లో ఎమోషన్స్‌కి పెద్ద పీట వేస్తుంటా. ఈ సినిమాలోనూ అవన్నీ ఉంటాయి.
ప్రొడక్షన్ వ్యవహారాల్లో కూడా మీరు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు..
అవునండీ. ప్రతీదీ దగ్గరుండి చూసుకొన్నా. అందుకే నిర్మాణ పరంగానూ చాలా సంతృప్తినిచ్చింది. ఇది వరకు ఏ సినిమాకీ లేనంత కాన్ఫిడెన్స్‌గా ఈ సినిమాకి ఉన్నా. ట్రైలర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పటి నుంచీ `కంగ్రాట్స్…` అంటూ మెసేజ్‌లు వచ్చేస్తున్నాయి. అయితే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోలేదు..
ఇలాంటి కథ నాకు పడితే బాగుణ్ణు అని నాగార్జున ఆడియో రిలీజ్లో చెప్పారు..
మావయ్య కొత్త తరహా కథల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. పదేళ్ల క్రితం ఈ కథ వినిపిస్తే.. తప్పకుండా ఆయన చేసేవారేమో.
చిన్న పిల్లలకు సంబంధించిన కథ కదా… ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ ధ్యాస పిల్లలపైకి పోలేదా?
రీలు జీవితం వేరు.. రియల్ లైఫ్ వేరు. రెండింటినీ ముడి పెట్టకూడదు. సెట్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశా. నాకూ పిల్లలుంటే బాగుణ్ణు అనిపించలేదు.
మరి మీ వారసులెవరు..?
ఓ కుక్కని దత్తత తీసుకొన్నా.. ప్రస్తుతానికి అదే.. (నవ్వుతూ)
మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదా?
ప్రస్తుతానికి లేదు..
భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది?
అన్ని రకాల సినిమాలు చేయడానికి నేను సిద్దమే. కానీ సరైన కథలు పడాలంతే. నెగిటీవ్ క్యారెక్టర్లంటే నాకు చాలా ఇష్టం. మన పురాణాల్లో రావణ బ్రహ్మ టైపు పాత్రన్నమాట. పౌరాణిక పాత్ర అయినా.. దాన్ని పోషించగలనన్న నమ్మకం ఉంది. తాతగారు కూడా నువ్వు డైలాగులు బాగా చెబుతావు, నీ తెలుగు ఉచ్ఛారణ బాగుంటుంది అంటుండేవారు. సో.. నా వరకూ నేను కాన్ఫిడెన్స్ గానే ఉన్నా. నెగిటీవ్ పాత్రలు ఎవరైనా తయారు చేస్తే తప్పకుండా చేస్తా.
తదుపరి సినిమా..
నాలుగైదు కథలు విన్నా. ఇంకా వింటున్నా. ఎప్పుడు ఏది నచ్చితే అది చేస్తా.
ఓకే.. ఆల్ ద బెస్ట్
థ్యాంక్యూ వెరీ మచ్.