ఇది వరకు విజువల్ ఎఫెక్ట్స్ ఓ హంగు మాత్రమే. ఇప్పుడు అది కూడా కమర్షియల్ అంశం అయిపోయింది. దానికీ బడ్జెట్లు కేటాయిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలకు, ఫాంటసీ కథలకూ.. వీఎఫ్ఎక్స్ తప్పని సరి. బాహుబలి తరవాత విఎఫ్ ఎక్స్ విలువ మరింత తెలిసొచ్చింది. దాన్నీ తెలివిగా వాడుకొంటున్నారు దర్శకులు. బాహుబలి బడ్జెట్లో దాదాపు 30 శాతం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు పెట్టారు. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి కూడా విజువల్ ఎఫెక్ట్స్‌ని డిమాండ్ చేసే సినిమానే. ఇందులో దాదాపు 40 నిమిషాలకు పైగా యుద్ద సన్నివేశాలున్నాయి. రాజ దర్బార్, యుద్ద రంగం, కోట… ఇవన్నీ విఎఫ్ఎక్స్లో చూపించాల్సిందే. అందుకోసం చిత్రబృందం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?? రూ.10 కోట్లు. సినిమా బడ్జెట్ రూ.55 కోట్లకు పైమాటే. అంటే దాదాపుగా 20 శాతం విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చయ్యాయన్నమాట.
ఈసినిమా కోసం క్రిష్ కొత్త స్కీమ్ ఒకటి ఫాలో అయ్యాడట. సన్నివేశాన్ని 90 శాతం లైవ్‌లోనే తీసి.. మిగిలిన 10 శాతానికి మాత్రమే విఎఫ్ఎక్స్ వాడుకొన్నాడట. ప్రతీ సీన్ లైవ్‌లో తీసినదే. బ్లూ మేట్లు వాడలేదు. అయితే ఆ సీన్‌ని విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు మరింత గ్రాండియర్‌గా చూపిస్తారన్నమాట. ఈ విధానం వల్ల ఖర్చు బాగా కలిసొచ్చిందని తెలుస్తోంది. వీఎఫ్ ఎక్స్ లో తీయాల్సిన సన్నివేశాన్ని కూడా లైవ్‌లో తీయడానికి క్రిష్ ప్రయత్నించాడట. దాంతో ఒరిజినాలిటీ మరింత పెరిగిందని, ఏ సన్నివేశాన్నీ గ్రాఫిక్స్ డామినేట్ చేయకుండా జాగ్రత్త పడ్డాడని తెలుస్తోంది. ప్రస్తుతం గౌతమి పుత్ర శాతకర్ణి గ్రాఫిక్స్ పనుల్ని 25 సంస్థలు టేకప్ చేస్తున్నాయి. ఒక్కొక్క టీమ్కీ కొన్ని సన్నివేశాల్ని పంచారన్నమాట. డిసెంబరు తొలి వారంలో గ్రాఫిక్స్ వర్క్ పూర్తవుతుందని తెలుస్తోంది.