తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు అనే అభిప్రాయం ఈ మధ్య జోరుగా వినిపించింది. అయితే, ఇప్పుడా కథనాలకు చెక్ పడ్డట్టే అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పదవీ కాలం పూర్తయ్యాకనే ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలే చెబుతూ ఉండటం విశేషం! తెలంగాణలో మధ్యంతరం వస్తుందని కొంతమంది కావాలనే గందరగోళ వాతావరణం క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారనీ, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగంగానే ఇలాంటి ఊహాగానాలు వినిపించాయని తెరాస వర్గాలు ఇప్పుడు మండిపడుతున్నాయి.
నిజానికి, మధ్యంతరం ఉంటుందనే సంకేతాలు ఇచ్చినవారు తెరాస నాయకులే కదా! ఆ మధ్య ఏ ఉప ఎన్నిక జరుగుతున్నా ముందస్తు ఎన్నికలు త్వరలోనే వస్తాయన్న రేంజిలో మాట్లాడేవారు. అంతేకాదు, సరైన సమయంలో వర్షాలకు కురవకపోవడం, ప్రభుత్వం భారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలులో జాప్యం రావడం, నిధుల లేమి వంటి సమస్యల వల్ల ప్రజల్లో కేసీఆర్పై కాస్త అసంతృప్తి మొదలైందన్న అంచనాలు వేసుకున్నది వారే! ఈ అసంతృప్తి మరో రెండున్నరేళ్లకు మరింత పెద్దదౌతుందన్న భావనతో ముందస్తు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం తెరాస నాయకుల నుంచే వ్యక్తమౌతూ వచ్చింది. అంతేకాదు, కేసీఆర్ వారసులుగా వచ్చే ఎన్నికల్లో ఎవరు ఉంటారు అనే చర్చ కూడా జరిగింది. వివిధ పార్టీల నుంచి తెరాసలోకి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడేలా ఉందనీ, ఒకవేళ అదే జరిగితే ఆ అవమాన భారంతో ఉప ఎన్నికలకు వెళ్లేకంటే… ఏకంగా మధ్యంతరానికి వెళ్తేనే మర్యాదగా ఉంటుందన్న అభిప్రాయం కూడా తెరాస వర్గాల నుంచే వినిపించింది. అలాంటప్పుడు ఈ యూ టర్న్ ఎందుకు తీసుకున్నట్టు..?
తాజాగా కొన్ని సర్వేలు వెలువడ్డ నేపథ్యంలో తెరాస మైండ్ సెట్ మారినట్టుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు అనుకూలంగా కొన్ని సర్వేలు రావడంతో మధ్యంతరంపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. వర్షాలు భారీగా కురవడం, కొత్త జిల్లాలు ఏర్పాటు తరువాత ప్రజల్లోనూ పార్టీ వర్గాల్లోనూ తెరాస నాయకత్వంపై కొత్త ఆశలు చిగురించడం, త్వరలోనే నియోజక వర్గాల పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉందనీ, ఈ విషయమై కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అనే ఆశల నేపథ్యంలో తెరాసపై వ్యతిరేకత తగ్గిందనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చి ఉంటారని అంటున్నారు. అందుకే, ఇప్పుడు మధ్యంతరం లేదని ఖండిస్తున్నారు. చిత్రమేంటంటే… మధ్యంతరం ఉంటుందన్న సంకేతాలు ఇచ్చిందీ వారే, అదంతా ఉత్తుత్తిదే అని ఇప్పుడు మాట మార్చిందీ వారే..!