జనసేన పార్టీని భాజపా వదలుకున్నట్టుగానే ఉంది! గత ఎన్నికల్లో ఆంధ్రాలో భాజపా తరఫున పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయించుకున్నారు. ఎన్నికల్లో మోడీ హవాకి పవన్ ప్రభావం కూడా తోడు కావడంతో ఆంధ్రాలో భాజపాకి కొంత ప్లస్ అయిన మాట వాస్తవమే. 2019 ఎన్నికల్లో జనసేనతో కలసి భాజపా జతకట్టే ఊహాగానాలు కూడా ఉండేవి. అయితే, ఎప్పుడైతే పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారో అప్పట్నుంచీ భాజపా నాయకులకు పవన్ మీద గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే, ఏపీకి భాజపా ఇచ్చిన ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చడం, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం… ఇవన్నీ సహజంగానే భాజపాకి కోపం తెప్పించే అంశాలు. అయితే, ఇన్నాళ్లూ జనసేన గురించి భాజపా ఓపెన్‌గా మట్లాడిన సందర్భాలు లేవు. తొలిసారిగా బుధవారం నాడు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
పవన్ కల్యాణ్ ఎన్డీయేలో ఎప్పుడూ భాగస్వామిగా వ్యవహరించలేదనీ, ఆయన గత ఎన్నికల్లో భాజపాకి మద్దతు మాత్రమే తెలిపారని సిద్ధార్థనాథ్ అన్నారు. ఎన్టీయేలో జనసేన భాగస్వామిగా కొనసాగుతుందా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… ‘ఎన్డీయేలో జనసేన భాగస్వామ్య పార్టీ అని పవన్ కల్యాణ్ ఎప్పుడైనా చెప్పారా….? లేదా, మా మిత్రపక్ష జనసేన అని ఎన్డీయే ఎప్పుడైనా ప్రకటించిందా..? జనసేన భాగస్వామ్య పార్టీ అని ఎన్డీయే కన్వీనర్ ఎప్పుడైనా అన్నారా..?’ అంటూ తిరిగి ప్రశ్నించారు సిద్ధార్థ్నాథ్. అయితే, గత ఎన్నికల్లో ఆయన కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారని మరోసారి స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్‌తో భాజపా కలిసి పనిచేసే అవకాశం ఉందనే హోప్ ఇన్నాళ్లూ ఉండేది. అయితే, జనసేన సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పాలి. పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును ఏలూరుకు మార్చుకున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు అక్కడి నుంచే నిర్వహించే అవకాశాలున్నాయి. త్వరలోనే అనంతపురంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో కూడా కేంద్రంలోని భాజపాపై పవన్ నిప్పులు చెరుగుతారన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్నాథ్ సింగ్ అలానే స్పందిస్తారు కదా! అయితే, రాజకీయాల్లో ఏదీ అసాధ్యం అని తీర్మానించలేం. వచ్చే ఎన్నికల్లో భాజపాతో జనసేన పొత్తు పెట్టుకునేందుకు వీలుగా, పవన్‌తో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం భవిష్యత్తులో ఉండదని ఇప్పుడు చెప్పలేం. ప్రస్తుతానికి పవన్‌పై ఉన్న గుర్రును భాజపా ఈ విధంగా వెళ్లగక్కిందని మాత్రం చెప్పుకోవచ్చు!