మూడేళ్లుగా ప్రపంచదేశాలకు నిద్రపట్టనీయకుండా చేస్తున్న ఇస్టామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ పీడ విరగడ కాబోతోంది! అమెరికా సైనిక దళం సాయంతో ఇరాక్ సేనలు చేపట్టిన ఆపరేషన్ మోసుల్ కీలక ఘట్టానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఐసిస్ కార్యకలాపాలన్నీ మోసుల్ నగరం నుంచే జరుగుతూ ఉండేవి. ఆ నగరాన్ని ఐసిస్ ఆక్రమించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, మారణహోమాన్ని సృష్టించింది. వివిధ దేశాల్లో ఐసిస్ విధ్వంసానికి అక్కడి నుంచే కుట్ర చేసేది ఐసిస్. అలాంటి మోసుల్‌ను రెండేళ్ల తరువాత సైన్యం రౌండప్ చేసింది. అంతేకాదు, ఐసిస్ ఛీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీని కూడా సైన్యం చుట్టుముట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మోసుల్ నగరంలో ఓ రహస్య స్థావరంలో బగ్దాదీ ఉన్నాడన్న పక్కా సమాచారంతోనే బలగాలు ముట్టడించాయని తెలుస్తోంది.
గడచిన ఏడాదిగా అజ్ఞాతంలో ఉంటున్న బగ్దాదీని సంకీర్ణ సైనిక దళాలు చుట్టుముట్టాయనీ, ఏ క్షణమైనా అతడిని మట్టుపెట్టే అవకాశం ఉందంటూ కుర్దిష్ అధికార ప్రతినిధి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదే జరిగితే ఐసిస్ ఛాప్టర్ క్లోజ్ అయినట్టే. బగ్దాదీని మట్టుబెట్టగలిగితే ఐసిస్ చరిత్రకు చరమగీతం పాడినట్టే అవుతుంది. అయితే, ఒకవేళ బాగ్దాదీ తప్పుకుంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే, ఐసిస్ ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే కదా! ఈ యుద్ధం మరింత తీవ్రంగా మారే ప్రమాదం కూడా ఉంది.
అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోందనీ, అమెరికా నుంచి వచ్చిన వైమానిక దళాల సాయంతో బాగ్దాదీని మట్టుపెట్టడం ఖాయమనే ధీమా వ్యక్తం అవుతోంది. టైగ్రిస్ నదికి రెండువైపులా మోసుల్ నగరం ఉంది. ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఐసిస్ ఖలీఫా రాజ్యాన్ని స్థాపించింది. ఇక, ఈ నగరంలో ఐసిస్ హింస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ ప్రజలను ఇన్ఫార్మర్లుగా అనుమానిస్తూ ఐసిస్ దారుణంగా చంపుతూ వస్తోంది. దీంతో చాలామంది ప్రాణాలు గుప్పిట్టో పెట్టుకుని నగరాన్ని వదిలేసి వెళ్లిపోయారు. మోసుల్‌ను ఎటాక్ చేయాలని దాదాపు కొన్ని నెలలుగా ఇరాకీ దళాలు ప్లాన్ చేస్తున్నాయి. మంగళవారం నాడు మోసుల్ ముట్టడి దిశగా దాళాలు కదలడం ప్రారంభమైంది. ఐసిస్ ఛీఫ్ నగరం నుంచి బయటకి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా.. అన్ని వైపుల నుంచీ ఇరాకీ సైన్యం ముట్టడి చేసిందని చెబుతున్నారు. గగనతలం నుంచి అమెరికా యుద్ధ విమానాలు ఐసిస్ స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. ఈ దెబ్బతో ఐసిస్ పీడ విరగడ కావాలని ప్రపంచదేశాలే కోరుకుంటున్నాయి.