షారుఖ్ ఖాన్ కూతురు టూ పీస్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. టీనేజ్ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ బికినీ స్టిల్స్లానే ఆ ఫొటోలు కూడా ఉండడంతో కొంతమంది మీడియా వాళ్ళు హాట్ అనో, స్పైసీ అనో ఏవో తమ పడికట్టు పదాలు వాడేసి ఆ ఫొటోలను కామెంట్ చేస్తూ వార్తలు రాసి పడేశారు. టీనేజ్‌లో ఉన్న అలియా భట్ ఫుల్ స్పైసీగా కనిపించిన ఓ సినిమాతో అసోసియేట్ అయిన షారుఖ్‌కి తన కూతురు గురించి రాసిన వార్తలు మాత్రం కోపం తెప్పించాయి. షారుఖ్ కోపంలో తప్పులేదని అప్పుడు చాలా మంది అభిప్రాయపడ్డారు. తండ్రిగా షారుఖ్ ఆవేధనలో అర్థం ఉంది కూడా. మరి ఆ షారుఖ్ ఖాన్ కూతురి హాట్ హాట్ ఫొటోలను ఆ అమ్మాయే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సెక్సీ ఎక్స్ప్రెషన్స్, హాట్ కాస్ట్యూమ్స్‌తో రకరకాల ఫోజులు ఇచ్చింది. సినిమా స్టార్ కూతురు కనుక మీడియా వాళ్ళు ఆ ఫొటోలు పబ్లిష్ చేయడం కామన్. మరి ఈ సారి షారుఖ్ ఖాన్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. అలాగే జయాబచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు నవ్యల కథ కూడా సేం టు సేం. టీనేజ్ దాటిన అమితాబ్ బచ్చన్ మనవరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు మలయాళం బి గ్రేడ్ సినిమాల పోస్టర్స్‌కి ఏ మాత్రం తగ్గవు. ఇక ఐశ్వర్యరాయ్ కూడా రెచ్చిపోతోందని జయాబచ్చన్ అభిప్రాయం. అందుకే తన ఆవేధనను అంతా మాటలుగా మార్చి ఐశ్వర్యను, మనవరాలిని ఏమీ అనలేక బాలీవుడ్ సినిమాల తీరు తెన్నులను తిట్టిపోసింది. ఇదే జయాబచ్చన్వారు తన వయసును కూడా మర్చిపోయి పబ్లిక్‌లో అమితాబ్‌ని కిస్ చేసిన విషయం మర్చిపోయినట్టున్నారు. భర్తపై ఉన్న రొమాంటిక్ ప్రేమను పబ్లిక్‌గా ప్రదర్శించాల్సిన అవసరం లేదేమో. ఐశ్వర్య-అభిషేక్, అమీర్‌ఖాన్-కిరణ్‌రావు…ఇంకా ఎవరైనా సరే వాళ్ళ ప్రైవేట్ జీవితాలను మీడియా ముందు ప్రదర్శించడం ఎందుకు?
ఇక మరో విషయంలో కూడా మన సినిమా సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ జీవితాలను పబ్లిక్ ప్లాట్ ఫాంపై పెట్టేస్తున్నారు. అధికారికంగా పెళ్ళి విషయం అందరికీ తెలిసిపోయిన మరుక్షణం నుంచి అమలా పాల్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. పెళ్ళి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరూ చేసేదే అని అనుకున్నా, హనీమూన్ ఫొటోలను కూడా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదేమో. ప్రపంచంలోనే మా అంత సంతోషంగా ఉండే కపుల్, ఎంజాయ్ చేస్తున్న కపుల్ ఇంకొకరు లేరు అనే రేంజ్లో సోషల్ మీడియాలో పోస్ట్‌ల వర్షం కురిపించింది అమలా పాల్. కట్ చేస్తే ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్‌తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రేణూదేశాయ్ వ్యవహారం కూడా ఇలానే ఉండేది. పెళ్ళి చేసుకున్నవాళ్ళ కంటే మేమే ఎక్కువ సంతోషంగా ఉన్నాం అని చెప్పడానికి ప్రయత్నం చేసేవారు. ‘పాపనాశం’ సినిమా ప్రమోషన్స్ టైంలో గౌతమీ కూడా అలానే చేసింది. కమల్ హాసన్‌తో తనది జన్మజన్మల బంధం, పెళ్ళి లాంటి పాత సాంప్రదాయాలు మాకు అవసరం లేదు. ఎప్పటికీ ఒకళ్ళకోసం ఒకళ్ళం ఉంటాం అనేలా మాట్లాడేసింది గౌతమి. గౌతమీ ఇంటర్యూ వార్తలు ఇంకా కళ్ళముందు కనిపిస్తుండగానే కటీఫ్ అయిన బ్రేకింగ్ న్యూస్‌లు మన ముందుకు వచ్చాయి.
బాత్రూం సెల్ఫీలు, బెడ్ రూం సెల్ఫీలు, పర్సనల్‌గా వాళ్ళు మందుకొడుతూనో, ఇంకా ఏవేవో చేస్తూ ఎంజాయ్ చేస్తున్న విధానం మొత్తాన్ని ప్రపంచానికి చూపించడానికి చాలా తాపత్రయ పడతారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని, మనుషుల్లో మహనీయులని, అద్భుతమైన అవకాశాలన్నీ వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయని, వాళ్ళ మంచితనం, దాతృత్వం, వాళ్ళ, గొప్పతనాల గురించీ………అబ్బో ఇంకా ఎలాంటి పాజిటివ్ వార్తలు, ఎన్ని రాసినా చాలా హ్యాపీగా ఫీలయిపోతారు. అదే నెగిటివ్ వార్తలు కనిపిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. మాకూ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అని గగ్గోలు పెట్టేస్తారు. వివాహ బంధాన్ని తెంచుకున్న తర్వాత కూడా పవన్‌తో రేణూకి ఎలాంటి స్నేహం ఉంది? అనే విషయం ఆమె పర్సనల్ కాదా? ఆ విషయాన్ని పబ్లిక్‌తో ఎందుకు పంచుకోవడం? పండగలప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫారెన్ టూర్స్ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? బెడ్ రూంలో ఎలా ఉంటున్నారు? ఏం బట్టలేసుకుంటారు? …..లాంటి విషయాలన్నీ ఈ సినిమా సెలబ్రిటీసే చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ గొప్పల గురించి, నలుగురూ వాళ్ళను గొప్పగా కీర్తించే అవకాశమున్న విషయాల గురించి ఎవ్వరూ అడక్కపోయినా గంటగంటలు చెప్పుకొస్తారు. అలాంటి పబ్లిసిటీ అంతా వాళ్ళకు కావాలి. కానీ అన్నీ కూడా పాజిటివ్ వార్తలే కావాలి….. అవి వాళ్ళ బెడ్ రూం విషయాలైనా ఒకె. అదే నెగిటివ్ వార్తలు రాస్తే మాత్రం వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడం చాలా పెద్ద పాపం అన్నట్టుగా పేద్ద పేద్ద సిధ్ధాంతాలు మాట్లాడేస్తూ విమర్శలు చేస్తారు. మనం చదువుకునే సబ్జెక్ట్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు ఈ ‘రెండు కళ్ళ శాస్త్రం’ కూడా ఉండేలా చేస్తే బాగుంటుందేమోనని అనిపిస్తోంది. మనుషులను అర్థం చేసుకోవడానికి, మనిషిగా ఎదగడానికి మనకు ఈ శాస్త్రం అవసరమే. ఏమంటారు?