తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతే. ఇక్కడ రిలేషన్స్, రెస్పెక్ట్, రిసీవింగ్ అంతా కూడా సక్సెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఒక్క హిట్ కొట్టామంటే చాలు అందరూ మనవైపు చూస్తారు. రెండో హిట్ పడిందంటే మన సలహాలను అడుగుతారు. ఇక హ్యాట్రిక్ హిట్ కొట్టామా…? నా సామి రంగా…..చాలా మంది మనకు భక్తులయిపోతారు. తెరవెనుక మనకో సూపర్ స్టార్ ఢం వచ్చేస్తుంది. ఆ మూడు సినిమాల సక్సెస్‌లో మన జడ్జ్మెంట్ వ్యాల్యూ ఎంతో, టాలెంట్ ఏంటో ఎవ్వడికీ తెలియకపోయినా సరే మనకేదో ఆడియన్స్ పల్స్ తెలిసిపోయిందని, సక్సెస్ సీక్రెట్స్‌ని పట్టేశామన్న భ్రమలతో అందరూ కూడా మన ఆలోచనలకు, సలహాలకు బీభత్సమైన రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. మనం ఏదైనా ఓ సినిమాతో అసోసియేట్ అయితే చాలు… ఆ సినిమా గ్యారెంటీగా హిట్ అని నమ్మేసి, ఎంత రేటు పెట్టి అయినా సరే ఆ సినిమాను కొనేయాలన్న నిర్ణయానికి వచ్చేస్తారు. దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో వరుసగా నాలుగు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దిల్ రాజుకు కూడా సక్సెస్‌తో వచ్చే అలాంటి స్టార్ ఢం అందరికంటే కాస్త ఎక్కువే వచ్చింది. అందుకే సూపర్ సక్సెస్‌లు కొట్టిన ఆ టైంలో దిల్ రాజు మా సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్నారు అని ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకునేవారు సినిమావారు. ఏదో ఒక ఏరియాకు దిల్ రాజు రైట్స్ కొన్నారన్న ఫీలర్స్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌లాంటి వాళ్ళు కూడా బిజినెస్ సర్కిల్స్‌లోకి వదిలేవాళ్ళు. అదీ దిల్ రాజు రేంజ్.
అయితే అదంతా గతం. గత కొంత కాలం దిల్ రాజు ఫేట్ ఏమీ బాగాలేదు. దిల్ రాజు స్థాయిని పెంచే రేంజ్ సూపర్ హిట్ సినిమా ఏదీ ఆయన బేనర్ నుంచి రాలేదు. పైగా మారుతితో కలిసి ‘రోజులు మారాయి’ లాంటి బి గ్రేడ్ సినిమాలకు కమిట్ అయి బిజినెస్ సర్కిల్స్‌లో ఉన్న పేరును చెడగొట్టుకున్నాడు. మళ్ళీ ఒక మాంచి హిట్ సినిమా తీయగలిగితే ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడం పెద్ద విషయం కాదుగానీ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ చేత సినిమాని కొనిపించడం మాత్రం చాలా కష్టమైన పని. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో, సినిమా ప్రమోషన్స్ టైంలో తెలుగు సినిమా హీరోలు, డైరెక్టర్స్ అందరూ కూడా చాలా సార్లు ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయి చాలా చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. ఆ ఓవర్ యాక్షన్ అంతా కూడా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసమే అని చాలా మంది అనుకుంటారు. అది కొంతవరకూ నిజం కూడా. కానీ ప్రేక్షకులకంటే ముందు సినిమాను కొనేవాళ్ళను నమ్మించాలన్న టార్గెట్ సినిమా ప్రొడ్యూసర్స్‌కి ఉంటుంది. శాటిలైట్ వాళ్ళు కొన్నేళ్ళ క్రితమే సినిమా వాళ్ళ మాయల గురించి తెలుసుకుని రియలైజ్ అయి జాగ్రత్తపడడం మొదలెట్టారు గానీ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్….ఇంకా చెప్పాలంటే సెకండ్, థర్డ్ హ్యాండ్ పార్టీల జనాలు మాత్రం ఇప్పుడిప్పుడే జాగ్రత్తపడుతున్నారు. అందుకే ఈ మధ్య రిలీజ్ అవుతున్న మీడియం రేంజ్ సినిమాలు కూడా ప్రొడ్యూసర్స్‌ని పూర్తిగా ముంచేస్తున్నాయి. పవన్, మహేష్‌లాంటి టాప్ స్టార్స్ నటించిన సినిమాల రిజల్ట్స్‌ని కూడా సినిమాని కొనేవాళ్ళు ముందుగానే పసిగట్టేస్తున్నారు. డిస్ర్టిబ్యూటర్స్ని, బయ్యర్స్‌ని నమ్మించడం కోసం సినిమా నిర్మాతలు, హీరోలు చాలా చాలా ఎక్కువ చెప్పెయ్యడానికి చాలా కష్టపడుతున్నారు. కెరీర్ బెస్ట్ అని, ప్రపంచంలోనే బెస్ట్ అని, ఇరగదీశాం, పొడిచేశాం అని చాలా చెప్తున్నారు. సినిమా చించేస్తుంది, బాహుబలిని కొట్టేస్తుంది, బ్రహ్మాండం అని భజన చేస్తున్నారు. కానీ కొనే వాళ్ళు మాత్రం ముందుకు రావడం లేదు. అందుకే ఇప్పుడు దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా ‘ఈ సినిమా కచ్చితంగా హిట్టు…..నాదీ గ్యారెంటీ…’ అనే దగ్గరకు వచ్చేశారు. ఇక ఆ తర్వాత దేవుడి మీద ప్రమాణం, అమ్మతోడు…మా సినిమా హిట్టు అని అంటారేమో.