నిన్నమొన్నటివరకూ జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయిన అంశాల్లో ప్రధానమైన వాటిలో ఒకటి… ఎస్పీ ఫ్యామిలీ వ్యవహారం. ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు అఖిలేష్, సోదరుడు శివపాల్ ల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న రచ్చ వీదికెక్కిన సమయమిది. దీంతో అఖిలేష్ వేరు కుంపటి పేడుతున్నారని వారికి కాంగ్రెస్ నుంచి మద్దతు లభించబోతుందని కథనాలు వచ్చాయి. ఇదే క్రమంలో ములాయం – శివపాల్ లకు బీజేపీ తోడు నిలవనుందనీ వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే వేదికపైకి వచ్చారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచారం లేటయ్యిందని భావించి రథయాత్రలో మొదలుపెట్టారు అఖిలేశ్ యాదవ్. సమాజ్వాది పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ “వికాస్ రథయాత్ర”ను అధినేత ములాయంసింగ్ యాదవ్ ప్రారంభించారు. ఈ క్రమంలో వర్గాలుగా విడిపోయిన ములాయం, అఖిలేశ్, ములాయం సోదరుడు శివపాల్ ఒకే వేదికపై ఆశీనులయ్యారు. ఇది ఎస్పీ సగటు కారకర్తకు శుభవార్తనే చెప్పాలి. ఈ క్రమంలో అఖిలేశ్… రథయాత్రను ప్రారంభించిన ములాయం కు కృతజ్ఞతలు తెలపగా, అఖిలేష్ కు శివ్ పాల్ శుభాకాంక్షలు తెలిపారు.. రథయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అఖిలేశ్… దేశ స్థితిగతులను మార్చే ఎన్నికలు ఇవేనని అభివర్ణించారు. తొలిదశ యాత్ర లఖ్ నవూ నుంచి ఉన్నవ్ జిల్లాకు సుమారు వందకిలోమీటర్లు సాగుతుంది. ఈ యాత్ర పొడవునా సుమారుగా రెండు లక్షల మంది కార్యకర్తలు పాల్గొనవచ్చనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఈ రథయాత్ర జరిగే చోట్ల పాఠశాలలను మూసివేయవలసిందిగా పోలీస్లు సూచించినట్లు చెబుతున్నారు. అయితే… యూపీ కి ముఖ్యమంత్రిగా ఉన్నా, సమాజ్ వాదీ పార్టీపై మాత్రం అఖిలేష్ పూర్తి పట్టు సంపాదించలేకపోయారనేది జగమెరిగిన సత్యం. బాబాయ్ శివ పాల్ యాదవ్ తో అతనికి చాలా ఆటంకాలు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీపై తన పట్టును నిలుపుకొనేందుకు, వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు అఖిలేశ్ యాదవ్ ఈ రథయాత్ర పేరున తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే చెప్పవచ్చు.