ఎంత టాలెంట్ ఉన్నా ఏం లాభం..? అదంతా వెలుగులోకి రావాలి. ఎవరైనా శుభ్రంగా వాడుకోవాలి. లేదంటే… ఉపయోగం ఉండదు. త్రిష టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆ విషయంలో డౌటే లేదు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలు చూస్తే త్రిషలో ఉన్న పెర్ఫార్మర్ సత్తా తెలుస్తుంది. అయితే… త్రిషని ఆ తరవాత ఎవరూ పెద్దగా వాడుకోలేదు. ఫస్ట్ కమర్షియల్ హీరోయిన్ టైపు పాత్రలకు పరిమితం అయ్యింది. అవన్నీ బోర్ కొట్టేయడం, కొత్త కథానాయికలు దూసుకు వచ్చేయడంతో త్రిష కెరీర్ మరుగున పడిపోయింది. త్రిష ఖేల్ ఖతం – దుకాణ్ బంద్ అనుకొంటున్న తరుణంలో ధర్మయోగి సినిమా వచ్చింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ అనేసరికి.. ఎవ్వరూ పట్టించుకోలేదు. మరో రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టరే అవుతుందిలే అని లైట్ తీసుకొన్నారు. పైగా అది ధనుష్ సినిమా ఆయె. తాను ఉంటే.. సినిమాలో మరెవ్వరికీ క్రెడిట్ ఇవ్వలేనంత విజృంభిస్తాడు. ధర్మయోగిలో కూడా అదే జరుగుతుందని ఆశించారు. అయితే ఈ సినిమాలో ధనుష్ తో పోటీ పడి నటించింది త్రిష. రుద్ర పాత్రలో విశ్వరూపం చూపించింది. ‘త్రిషలో ఇంకా టాలెంట్ మిగిలే ఉంది.. ఎవ్వరూ వాడుకోవడం లేదంతే’ అనేంత స్థాయిలో నటించేసింది. ఈ సినిమా చూశాక.. ధనుష్ పాత్రనైనా మర్చిపోవొచ్చు గానీ… త్రిష మాత్రం గుర్తుండిపోతుంది. అలాంటి త్రిషకు కూడా ధర్మయోగి టీమ్ అన్యాయం చేస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్లలో త్రిషని ఎవ్వరూ వాడుకోవడం లేదు. పోస్టర్లలో, ట్రైలర్ కటింగుల్లో త్రిష కంటే.. చిన్న వేషం వేసిన అనుపమ పరమేశ్వరన్‌ని హైలెట్ చేస్తున్నారు. తెలుగులోనే కాదు, తమిళంలోనూ ఇదే తంతు. అనుపమ పాత్ర త్రిష ముందు తేలిపోయేది. కానీ.. త్రిషకంటే అనుపమకే తెలుగులో క్రేజ్ ఉందని భావించిన నిర్మాతలు ఆమెపై ఫోకస్ పెట్టారని టాక్. దాంతో త్రిష అలిగిందని, నిర్మాతలతో గొడవ పడుతోందని తెలుస్తోంది. రాక రాక ఇంత మంచి పాత్ర వస్తే.. నన్ను తొక్కేస్తారా, ప్రమోషన్లు దొరక్కుండా చేస్తారా, అంటూ ఫైర్ అవుతోందట. టీవీల్లోనూ, పోస్టర్లలోనూ కనిపించకపోతే ఏంటట.. ఈ సినిమాలో మాత్రం ఇరగదీసింది త్రిష. సినిమా చూసినోళ్లమాట ఇది. ఇది చాలదూ… త్రిష పొంగిపోవడానికి.