నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ… ప్రతీ విషయం నుంచీ ఎంతో కొంత తెలుసుకోవచ్చనేది తెలిసిన విషయమే. ప్రతీ వ్యక్తి తన స్వీయానుభవం నుంచే కాదు, ఇతరుల అనుభవాలను సైతం పాఠాలుగా భావించి పైకి వెళ్లాలని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా దేశంలోనే హాట్ టాపిక్ అయిన టాటా సన్స్ వివాదంపై పాఠాలు చెప్పబోతున్నారట. టాటా చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అకస్మాత్తుగా తొలగించడంతో రాజుకున్న వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఈ సమయంలో వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఈ సమయంలో పోటీదారుల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి వంటి విషయాలు రేపటి పాఠాలంట!
అవును… తాజాగా నెలకొన్న టాటా సన్స్ వివాదం బిజినెస్ స్కూల్ విద్యార్థులకు పాఠంగా మారనుంది. మిస్త్రీ ఉద్వాసన, తదనంతర పరిణామాలు బిజినెస్ స్కూల్ విద్యార్థుల విజయానికి ఎంతగానో దోహద పడతాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వంటి సంస్థల ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారట. ఈమేరకు మిస్త్రీ ఉద్వాసన అనంతరం జరిగిన చాలా పరిణామాలను కూలంకషంగా పరిశీలించినట్టు వారు చెబుతున్నారట. ఈ వివాదంలో యాజమాన్య హక్కులు, సంస్థాగత పరిపాలనా హక్కులపై దృష్టి సారించినట్టు వారు వివరించారు. దీంతో విరి వివాదం రేపటి బిజినెస్ పీపుల్స్, నేటి బిజినెస్ స్కూల్ విద్యార్థులకు పాఠాలు కాబోతున్నాయన్నమాట!