ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే సూచనలు చాలా కాలంగా కనబడుతున్నప్పటికీ ఇంకా ప్రజలలో ఆశలు వదులుకోలేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయినప్పుడు రాష్ట్రంలో ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను వివరించి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రధానిని ఒప్పిస్తారని అందరూ చాలా ఆశగా ఎదురు చూసారు. కానీ సమావేశం ముగిసిన తరువాత చంద్రబాబు,ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను బట్టి రాష్ట్రానికి ఇక ప్రత్యేక హోదా రాదనే సంగతి స్పష్టం అయిపోయింది.
చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రూ. 2, 25, 486 కోట్లు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి కోరుతూ ప్రధాని మోడీకి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక ఇవ్వడం గమనిస్తే ప్రత్యేక హోదాకు బదులుగా ఆర్ధిక ప్యాకేజి ఇవ్వవలసిందిగా ఆయన స్వయంగా కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లయింది. అంటే ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఆయనే స్వయంగా దృవీకరించినట్లయింది. కానీ హూద్ హూద్ తుఫాను సహాయ, పునరావాస పనుల కోసం మోడీ స్వయంగా ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేయడానికే కేంద్రప్రభుత్వానికి ఏడాది సమయం తీసుకొన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు కోరుతున్న ఈ రెండు లక్షల కోట్లు మంజూరు చేస్తుందో లేదో, అందులో ఎంతో కొంత మంజూరు చేసినట్లు ప్రకటించినా వాటిని ఎప్పటిలోగా విడుదల చేస్తుందో ఎవరికీ తెలియదు.
వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కోరిన నిధుల వివరాలు: రహదారుల అభివృద్ధి: రూ. 27, 985 కోట్లు, వ్యవసాయాభివృద్ధికి: రూ. 24, 627 కోట్లు, పట్టణాభివృద్ధి రూ. 14,106 కోట్లు, గ్రామీణ త్రాగునీటి సరఫరా: రూ. 13,714 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి: రూ. 3,100 కోట్లు, పోర్టుల అభివృద్ధి: రూ. 4,800 కోట్లు, రైల్వేలు: రూ. 21,420 కోట్లు, పర్యాటక శాఖ: రూ. 4,750 కోట్లు, అటవీ శాఖ: రూ.1,950 కోట్లు, విద్యుత్: రూ. 3,190 కోట్లు.