రాష్ట్ర విభజన తరువాత హటాత్తుగా మాయమయిపోయిన అనేకమంది కాంగ్రెస్ నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒకరు. మళ్ళీ ఆయన రాజకీయాలలో ఏక్టివ్ అవుతున్నట్లున్నారు. అందుకే ప్రత్యేక హోదా, భూసేకరణ తదితర అంశాల గురించి ప్రెస్ మీటలు పెట్టి మరీ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరింపబడిన తరువాత ఇంతవరకు ఏ పార్టీలోను చేరలేదు. కానీ వైకాపాలోకి వెళ్ళే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన తెదేపా లేదా బీజేపీల వైపు చూస్తున్నట్లయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈవిధంగా విమర్శించేవారు. కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి మనసులో మాటలనే ప్రెస్ మీట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నట్లుంది.
చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవబోతున్నరనే వార్త వెలువడగానే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే చంద్రబాబు నాయుడికి రాజకీయ భవిష్యత్ ఉండదని ఉండవల్లి జోస్యం చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించలేకపోవడంతో మోడీ ముందు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ప్రతిపాదన పెట్టారని అభిప్రాయపడ్డారు. ఓటుకి నోటు కేసులో తనను ప్రధాని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే మోడీని గట్టిగా నిలదీయలేకపోయారని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేసారు. కానీ ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఇరుకొనే అవకాశం లేదు కనుక చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా నిలదీసి ఉండాల్సిందని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మోడీ ముందు తోకముడుచుకొని బయటకు వచ్చేసారని ఆక్షేపించారు. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అంతకంటే ఎక్కువే నిధులు మంజూరు చేస్తామని చెప్పడం పెళ్లి చేసుకోకుండా సంసారం చేయమన్నట్లుందని ఉండవల్లి ఎద్దేవా చేసారు. ఇద్దరు నాయుళ్ళు కేంద్రంతో కలిసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారని విమర్శించారు. బీహార్ రాష్ట్రానికి రూ. 1.25 కోట్లు నిధులు మంజూరు చేయగా లేనిదీ ఏపీకి ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఉండవల్లి అడుగుతున్న ఈ ప్రశ్నలన్నీ సమంజసమయినవే. కానీ ఆయన వీటిని ఏదో ఒక రాజకీయ పార్టీ తరపున నిలబడి అడిగి ఉండి ఉంటే వాటికి ఒక విలువ ఉండేది. ఇదే అభిప్రాయాలను రాష్ర్టంలో ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు వారితో బాటు ఆయన కూడా చెప్పడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండబోదు మీడియాలో కనబడటం తప్ప. ఉండవల్లి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇవ్వడం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ భూసేకరణ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలో చెప్పలేకపోయినా, ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని ట్వీటర్ లో మెసేజులు పెడుతున్నట్లే ఉంది. ఒకవేళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఉండవల్లి భావించి, దాని గురించి గట్టిగా పోరాడలనుకొన్నట్లయితే ఈవిధంగా ప్రెస్ మీట్లు పెట్టి తన వాగ్ధాటి ప్రదర్శించడం కంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరో లేక స్థాపించుకోనో దీనిపై పోరాడితే ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తారు. కేంద్రం కూడా దిగివస్తుంది. లేకుంటే ఆయన ప్రెస్ మీట్ల అంతర్యం ఏమిటని సందేహించవలసి వస్తుంది.