హైదరాబాద్: మాస్ మహారాజా పొరపాటు చేశాడట. కిక్-2 విషయంలో తాను పొరపాటు చేశానని రవితేజ చెప్పారు. సినిమా లెంగ్త్ ఎక్కువైందని తనకు అనిపించినప్పటికీ నిర్ణయాన్ని సురేందర్ రెడ్డికి వదిలేశానని తెలిపారు. మొదటిరోజు చూస్తే సెకండ్ హాఫ్‌లో ఆడియెన్స్ బోర్ ఫీలవుతున్నట్లు కనుగొన్నామని, వెంటనే రెండోరోజున 20 నిమిషాలు కత్తిరించామని చెప్పారు. ఇప్పుడు చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతోందని అన్నారు. వాస్తవానికి తన ప్రతి చిత్రం విషయంలో తుది నిర్ణయం తానే తీసుకుంటానని, ఈసారి మాత్రం దర్శకుడు సీనియర్ కాబట్టి, ఆయన అభిప్రాయాన్ని గౌరవించాలని భావించి నిర్ణయాన్ని అతనికి(సురేందర్ రెడ్డికి) వదిలేశానని చెప్పారు. అప్పటికీ సినిమా నిడివి ఎక్కువైందని అతనికి చెబుతూనే ఉన్నానని, అతను పట్టించుకోలేదని అన్నారు.
ఈ చిత్రంద్వారా ఒక గుణపాఠం నేర్చుకున్నానని రవితేజ చెప్పారు. సినిమాలో ఏది ఆకట్టుకుంటుందీ, ఏది ఆకట్టుకోదనేది తాను బాగా అంచనా వేయగలనని, ఇకనుంచి ప్రతి సినిమా విషయంలో తన అంచనాననుసరించే నడుస్తానని అన్నారు. అభిమానులను నిరాశపరచకుండా చేయాల్సిన బాధ్యత తనపైనే ఉంటుందని చెప్పారు. తన తదుపరి చిత్రం రాయల్ బెంగాల్ టైగర్ పూర్తిగా పక్కా మసాలా చిత్రమని తెలిపారు. కిక్-2లో కొద్దిగా ప్రయోగాలు చేశామని, అయితే రాయల్ బెంగాల్ టైగర్ చిత్రంలో అలా కాదని అది పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ అని చెప్పారు. కిక్-3 కూడా వస్తుందని, అయితే ఈసారి తాము మరింత జాగ్రత్తగా ఉంటామని రవితేజ అన్నారు.